three farmers
-
కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతుల మృతి
కల్హేర్/మామడ/ ధర్మారం: వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు. మెదక్‌లో ఒకరు, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు కరెంటుకాటుకు బలయ్యారు. మెదక్ జిల్లా కల్హేర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన రైతు గైని సాయిలు (55) గురువారం ఉదయం ఇంటి నుంచి పొలం వెళ్లి తిరిగి రాలేదు. భార్య భూమవ్వ సాయంత్రం పొలానికి వెళ్లి చూడగా సాయిలు నిర్జీవంగా పడి ఉన్నాడు. విద్యుత్ తీగలు అతని మృతదేహం పక్కగా వేలాడుతూ కనిపించాయి. కాగా, సాగు నిమిత్తం సాయిలు రూ.2 లక్షల వరకు అప్పులు చేశాడని, అవెలా తీర్చాలా అని బాధపడేవాడని, ఈ క్రమంలోనే విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబీకులు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం కమల్‌కోట్ గ్రామానికి చెందిన రైతు అబ్బడి రాజేశ్వర్ రెడ్డి(44) విద్యుదాఘాతంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా ఉంటుందనే ఆలోచనతో.. బుధవారం రాత్రి 7 గంటలకు పొలానికి చేరుకున్నాడు. స్టార్టర్కు వచ్చే ఒక విద్యుత్తు తీగ కింద పడి ఉంది. చీకట్లో కనిపించక.. అది కాలికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం చామనపల్లికి చెందిన రైతు ఎండీ చాంద్‌మియూ(55) ఫ్యూజ్‌వైర్ వేస్తూ కరెంట్‌షాక్‌తో ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలు విడిచాడు. -
ముగ్గురు రైతుల బలవన్మరణం
వరంగల్: అప్పుల బాధతో కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో మంగళవారం ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా కాటారానికి చెందిన గోగుల రాజబాబు(26) గతేడాది మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతానికి వెళ్లి నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పెట్టుబడికి రూ.2 లక్షలు అప్పు చేశాడు. కానీ, పంట పండలేదు. ఈ ఏడాది కాటారంలో మూడెకరాలు కౌలుకు తీసుకుని మళ్లీ పత్తి వేశాడు. పెట్టుబడి కోసం రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. మెుత్తం అప్పు రూ.3.50 లక్షలకు చేరింది. ఆశించిన మేర రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని మనోవేదన చెందాడు. రాజబాబు మంగళవారం సమీప అటవీ ప్రాంతంలో ఉరేసుకున్నాడు. అతడికి భార్య శారద, కుమారుడు ఉన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన ముక్కాంల లింగమ్మ (48), భర్త లింగయ్యతో కలిసి వ్యవసాయం చే స్తోంది. తమకున్న 5 ఎకరాలతోపాటు మరో 5 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, వరిని సాగు చేశారు. పెట్టుబడుల కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశారు. పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంట్లోనే పురుగులమందు తాగింది. అలాగే, వరంగల్ జిల్లా ములుగు మండలం జంగాలపల్లికి చెందిన రేగుల ఊర్మిళ(35), సదయ్య దంపతులు భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. భర్త సదయ్య కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. ఊర్మిళ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రబీలో నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేసింది. పంట చేతికందే సమయంలో అకాల వర్షంతో పంట నేలవాలింది. దీంతో మనస్తాపానికి గురైన ఊర్మిళ సోమవారం రాత్రి వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. -
విద్యుత్‌షాక్‌తో ముగ్గురు రైతుల మృతి
సాక్షి నెట్వర్క్: కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి పరిధి శంషాబాద్‌కు చెందిన మెరుగు మల్లయ్య(55) వరికి నీరు పెట్టేందుకు శనివారం ఉదయం వెళ్లాడు. మోటార్ ఆన్ చేసిన అనంతరం క్రేన్ వైర్‌ను పట్టుకోగా కరెంట్ సరఫరా అయి షాక్‌తో మృతి చెం దాడు. వరంగల్ జిల్లా కేసముద్రం మండలంలోని బేరువాడ శివారు బోడమంచ్యా తండాకు చెందిన దారావత్ మల్సూర్, కంసాలి దంపతుల కుమారుడు హుస్సేన్(23) ఇనుప బురదగొర్రును భుజంపై మోసుకుంటూ వెళుతుండగా పొలంలో కిందకు వేలాడుతున్న 11 కే వీ విద్యుత్తీగ తాకింది. విద్యుదాఘాతానికి గురై హుస్సేన్ చనిపోయాడు. ఇతడికి నాలుగు నెలల క్రితమే వివాహమైంది. కురవి మండలం బందంకొమ్ము తండాకు చెందిన బానోత్ హచ్చా(56) వ్యవసాయ బావి వద్ద ఉన్న బోర్‌మోటార్‌కు ప్లాస్టిక్ కవర్‌ను కప్పుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు.