కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతుల మృతి
కల్హేర్/మామడ/ ధర్మారం: వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు. మెదక్‌లో ఒకరు, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు కరెంటుకాటుకు బలయ్యారు. మెదక్ జిల్లా కల్హేర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన రైతు గైని సాయిలు (55) గురువారం ఉదయం ఇంటి నుంచి పొలం వెళ్లి తిరిగి రాలేదు. భార్య భూమవ్వ సాయంత్రం పొలానికి వెళ్లి చూడగా సాయిలు నిర్జీవంగా పడి ఉన్నాడు. విద్యుత్ తీగలు అతని మృతదేహం పక్కగా వేలాడుతూ కనిపించాయి.
కాగా, సాగు నిమిత్తం సాయిలు రూ.2 లక్షల వరకు అప్పులు చేశాడని, అవెలా తీర్చాలా అని బాధపడేవాడని, ఈ క్రమంలోనే విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబీకులు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం కమల్‌కోట్ గ్రామానికి చెందిన రైతు అబ్బడి రాజేశ్వర్ రెడ్డి(44) విద్యుదాఘాతంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా ఉంటుందనే ఆలోచనతో.. బుధవారం రాత్రి 7 గంటలకు పొలానికి చేరుకున్నాడు.
స్టార్టర్‌కు వచ్చే ఒక విద్యుత్తు తీగ కింద పడి ఉంది. చీకట్లో కనిపించక.. అది కాలికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం చామనపల్లికి చెందిన రైతు ఎండీ చాంద్‌మియూ(55) ఫ్యూజ్‌వైర్ వేస్తూ కరెంట్‌షాక్‌తో ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలు విడిచాడు.