గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ప్లాంట్ల విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల తయారీలో ఉన్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ప్లాంట్లలో త్రీ–వీలర్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఆంపియర్, ఈలీ, గ్రీవ్స్, ఈల్ట్రా బ్రాండ్స్లో ఎలక్ట్రిక్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాలను విక్రయిస్తున్న ఈ సంస్థకు తెలంగాణలోని తూప్రాన్, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా, తమిళనాడులోని రాణిపేట్ వద్ద తయారీ కేంద్రాలు ఉన్నాయి. గ్రేటర్ నోయిడా ప్లాంట్లో త్రిచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 21,514 యూనిట్ల నుంచి 45,896 యూనిట్లకు, తూప్రాన్ ప్లాంట్లో 13,538 నుంచి 34,800 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ‘విస్తరిస్తున్న మార్కెట్కు అనుగుణంగా అదనంగా ఉత్పత్తి చేయడానికి, అలాగే కొత్త మోడళ్ల తయారీని కూడా ఈ విస్తరణ అనుమతిస్తుంది’ అని కంపెనీ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్లో పేర్కొంది.ఐపీవో ద్వారా వచ్చే నిధులతో..గ్రీవ్స్ ఎలక్ట్రిక్ గ్రేటర్ నోయిడాలో ఫెసిలిటీ విస్తరణ కోసం రూ.20 కోట్లు, తూప్రాన్ ప్లాంటుకు రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రతిపాదిత ఐపీవో ద్వారా వచ్చే నికర ఆదాయం నుండి ఈ పెట్టుబడులకు నిధులు సమకూర్చనున్నారు. రాణిపేట్ ప్లాంట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను, గ్రేటర్ నోయిడా కేంద్రంలో ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లను, తూప్రాన్ ఫెసిలిటీలో ఎలక్ట్రిక్తోపాటు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ త్రీ–వీలర్లను సంస్థ తయారు చేస్తోంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థలు బెస్ట్వే ఏజెన్సీస్ గ్రేటర్ నోయిడా కేంద్రాన్ని, ఎంఎల్ఆర్ ఆటో తూప్రాన్ ప్లాంట్ను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వార్షికంగా 4.80 లక్షల ద్విచక్ర వాహనాల సామర్థ్యం కలిగిన రాణిపేట ప్లాంట్లో తయారీ సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో కంపెనీకి ప్రస్తుతానికి లేదు.త్రీ–వీలర్ల వాటా 28 శాతం..2023–24లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొత్తం ఆదాయంలో త్రీ–వీలర్ల వాటా 28 శాతం కైవసం చేసుకుంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 13,470 యూనిట్ల త్రిచక్ర వాహనాలను విక్రయించింది. 2022–23లో ఈ సంఖ్య 6,870 యూనిట్లు. ఆంపియర్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ టూ–వీలర్ వ్యాపారం దాదాపు 68 శాతం వాటాతో ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఆంపియర్ ద్విచక్ర వాహనాల అమ్మకాల పరిమాణం 2022–23లో 1.09 లక్షల యూనిట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 47,820 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరుకు చెందిన గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ అనుబంధ కంపెనీయే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్..రాణి పేటలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయనుంది. ఇది 4,00,000 యూనిట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిపాదిత నూతన కేంద్రాన్ని 2026 మే నెలలో ప్రారంభించనునన్నారు. 2026 జూలైలో వాణిజ్యపరంగా ఉత్పత్తి కార్యకలాపాలను మొదలు పెట్టాలని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ భావిస్తోంది. ఈల్ట్రా బ్రాండ్ పోర్ట్ఫోలియో ప్రస్తుతం రూ.3.80 లక్షల నుండి ప్రారంభం. ప్యాసింజర్స్ లేదా వస్తువులను రవాణా చేయగల రెండు మీడియం స్పీడ్ త్రీ–వీలర్ మోడళ్లను విక్రయిస్తోంది. డీజిల్, సీఎన్జీ త్రీ–వీలర్లు గ్రీవ్స్ బ్రాండ్ ద్వారా రూ.2.90 లక్షల ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్ కింద నాలుగు మోడళ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ రిక్షా బ్రాండ్ ఈలీ కింద మూడు మోడళ్లు కొలువుదీరాయి. ధరల శ్రేణి రూ.1.30 లక్షల నుండి ప్రారంభం.