Times Person of the Year
-
టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎలన్ మస్క్
Time's person of the year 2021: టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్–2021’గా టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ను ఎంపిక చేసింది. అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమాన్‌గా ఆయనను అభివర్ణించింది. అంతరిక్షయాన సంస్థ స్సేస్ ఎక్స్‌కు కూడా మస్క్ సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. మధ్యలో ఇద్దరి మధ్య దోబుచులాట నడిచినప్పటికీ.. చివరికి తన సంపదను అమాంతం పెంచేసుకుని అపర కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు యాభై ఏళ్ల మస్క్. ప్రస్తుతం సంపద దాదాపు 253 బిలియన్ డాలర్లు ఉంది. ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా గుర్తింపు పొందిన టెస్లాలో మస్క్‌కు 17 శాతం షేర్లున్నాయి(చాలా వరకు అమ్మేసుకుంటూ పోతున్నాడు). 1927 నుంచి ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగింపులో పర్సన్ ఆఫ్ ది ఇయర్ వార్తా కథనాన్ని టైమ్ మ్యాగజైన్ ప్రచురిస్తున్నది. ఆ వ్యక్తి ఫొటోను కవర్‌పేజీపై ముద్రిస్తుంది. ఏడాది కాలంలో వివిధ అంశాల్లో ఆయా వ్యక్తుల ఇన్ఫ్ల్యూయెన్స్ ఆధారంగా పర్సన్ ఆఫ్ ది ఇయర్`ను ఎంపిక చేస్తుంది. సోషల్ మీడియాలో మస్క్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకూ ఆయనపై అంతే నమ్మకమని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ముఖ్యంగా క్రిప్టో మార్కెట్‌ను ఒకే ఒక్క ట్వీట్‌తో శాసిస్తూ వస్తున్నాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఇక ట్విట్టర్లో ఎలన్ మస్క్ 6.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టెస్లా సీఈవోగానే కాకుండా సొంత రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కూ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు యాభై ఏళ్ల ఎలన్ మస్క్. టెస్లా నుంచి పైసా కూడా జీతంగా తీసుకోకుండా.. తన వాటా ద్వారా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇక స్పేస్ఎక్స్ ఒప్పందాలు-షేర్లతోనూ బిలియన్లు సంపాదిస్తున్నాడు. వీటితో పాటు ది బోరింగ్ కంపెనీ అనే మౌలిక వసతుల కంపెనీ, బ్రెయిన్ చిప్ స్టార్టప్ ‘న్యూరాలింక్’లకు వ్యవస్థాపకుడి హోదాలో పని చేస్తున్నాడు. చదవండి: ఎలన్ మస్క్ వెటకారం! ప్రధాని పైనా సెటైర్లు -
‘టైమ్స్ పర్సన్’ మళ్లీనా.. నాకొద్దు..!!
వాషింగ్టన్ : ‘టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2017’ ను తిరస్కరించాలని తాను నిర్ణయించుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ మేరకు ట్వీట్లు చేశారు. ఈ ఏడాది కూడా తానే టైమ్స్ పర్సన్‌గా ఎంపిక అవుతాననే సమాచారం అందినట్లు చెప్పారు. మేగజీన్‌పై ఫొటో కోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయాల్సివుంటుందని, అది తనకు ఇష్టం లేదని అన్నారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2017ను అవార్డును తాను స్వీకరించబోనని చెప్పారు. టైమ్స్ తదితర మేగజిన్స్ కవర్లపై కనిపించేందుకు ట్రంప్ తెగ ఉబలాటపడిపోయిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. 2015 టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా తనను ఎంపిక చేయనందుకు ట్రంప్ టైమ్స్పై ఫైర్ అయ్యారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - 2016గా ట్రంప్ ఎంపికైన విషయం తెలిసిందే. కాగా, ట్రంప్ ట్వీట్లపై స్పందించిన టైమ్స్ అవార్డును ఇచ్చేందుకు అనుసరించే విధానం గురించి తెలియకుండా అధ్యక్షుడు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించింది. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2017పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని పేర్కొంది. కాగా, ఈ ఏడాది టైమ్స్ పర్సన్ ఆఫ్ ఇయర్‌ను టైమ్స్ మేగజీన్ వచ్చే నెల ఆరో తేదీన ప్రకటించనుంది. -
‘టైమ్స్ పర్సన్’ రేసులో మోదీ నం1
న్యూయార్క్: నోట్ల రద్దు, నిన్న పాకిస్థాన్ కట్టడి, మొన్న సర్జికల్ స్ట్రైక్స్.. ఇలా ఎవ్వరూ ఊహించని సాహసోపేత నిర్ణయాలతో స్వదేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇప్పటికే ఇండియాలో అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లను కలిగిన ఆయన.. ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ ‘టైమ్స్’ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ రేసులోనూ దూసుకుపోతున్నారు. టైమ్స్ రీడర్స్ ఛాయిస్ ఓటింగ్‌లో 21 శాతం ఓట్లు సాధించిన మోదీ.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను సైతం వెనక్కినెట్టి తన సత్తా చాటుకున్నారు. డిసెంబర్ 4తో రీడర్స్ ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. మోదీ సమీప ప్రత్యర్థులెవరూ ఆయన ఓటింగ్ శాతానికి చేరువగా లేకపోవడాన్ని గమనిస్తే 2016 టైమ్స్ రీడర్స్‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు మోదీకి దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది. గోవా వేదికగా అక్టోబర్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు, అంతకు ముందు రద్దయిన సార్క్ సదస్సుల సమయాల్లో ఉగ్రవాద అనుకూల దేశాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ వేసిన ఎత్తుగడలు, ప్రధానంగా అక్టోబర్ 16న(బ్రిక్స్ సదస్సులో) ‘పాకిస్థాన్ ఉగ్రవాదానికి తల్లిలాంటిది..’అనే సంచలన ప్రకటన ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయని, అందుకే టైమ్స్ రీడర్లు మోదీకి భారీగా ఓట్లు వేస్తున్నారని టైమ్స్ మ్యాగజైన్ ప్రతినిధులు సోమవారం మీడియాకు వెల్లడించారు. 2015లోనూ నరేంద్ర మోదీ టైమ్స్ రీడర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. కానీ ప్రధాన అవార్డు ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ మాత్రం జర్మన్ చాన్సలర్ ఏంజిలా మోర్కెల్‌కు దిక్కింది. ఓకే ఏడాది కాలంలో ప్రపంచాన్ని విపరీతంగా ప్రభావితం (మంచిగానో, చెడుగానో) చేసిన వ్యక్తులకు టైమ్స్ ప్రకటించే అవార్డును పలు దేశాలు, సంస్థలు విశిష్ఠంగా భావిస్తాయని తెలిసిందే. ఇక 2016 పర్సన్ ఆఫ్ ది ఇయర్ రేసు విషయానికి వస్తే.. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 లక్షల మంది టైమక్స్ రీడర్లు పాల్గొనే ఓటింగ్‌లో ప్రస్తుతానికి మోదీ ముందంజలో ఉండగా, (ఇంతకు ముందే రెండుసార్లు అవార్డు అందుకున్న)అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 7 శాతం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 6 శాతం, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ 6 శాతం ఓట్లు సాధించారు. కాగా, వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే.. అన్నీ ‘ఎస్’ ఓట్లు సాధిస్తూ ట్రంప్‌కు గట్టి పోటి ఇస్తున్నారని టైమ్స్ ప్రతినిధులు తెలిపారు. వీళ్లే కాక టైమ్స్ పర్సన్ అఫ్ ది ఇయర్ అవార్డు రేసులో హిల్లరీ క్లింటన్, ఎఫ్‌బీఐ మాజీ చీఫ్ జేమ్స్ కామీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్, అమెరికన్ ముస్లిం సైనికుడి(హుమాయున్ ఖాన్) తల్లిదండ్రులు, ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్, బ్రిటన్ పీఎం థెరిసా మే, చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ తదితరులు ఉన్నారు.