‘టైమ్స్ పర్సన్’ రేసులో మోదీ నం1
న్యూయార్క్: నోట్ల రద్దు, నిన్న పాకిస్థాన్ కట్టడి, మొన్న సర్జికల్ స్ట్రైక్స్.. ఇలా ఎవ్వరూ ఊహించని సాహసోపేత నిర్ణయాలతో స్వదేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇప్పటికే ఇండియాలో అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లను కలిగిన ఆయన.. ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ ‘టైమ్స్’ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ రేసులోనూ దూసుకుపోతున్నారు. టైమ్స్ రీడర్స్ ఛాయిస్ ఓటింగ్‌లో 21 శాతం ఓట్లు సాధించిన మోదీ.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను సైతం వెనక్కినెట్టి తన సత్తా చాటుకున్నారు. డిసెంబర్ 4తో రీడర్స్ ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. మోదీ సమీప ప్రత్యర్థులెవరూ ఆయన ఓటింగ్ శాతానికి చేరువగా లేకపోవడాన్ని గమనిస్తే 2016 టైమ్స్ రీడర్స్‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు మోదీకి దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది.
గోవా వేదికగా అక్టోబర్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు, అంతకు ముందు రద్దయిన సార్క్ సదస్సుల సమయాల్లో ఉగ్రవాద అనుకూల దేశాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ వేసిన ఎత్తుగడలు, ప్రధానంగా అక్టోబర్ 16న(బ్రిక్స్ సదస్సులో) ‘పాకిస్థాన్ ఉగ్రవాదానికి తల్లిలాంటిది..’అనే సంచలన ప్రకటన ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయని, అందుకే టైమ్స్ రీడర్లు మోదీకి భారీగా ఓట్లు వేస్తున్నారని టైమ్స్ మ్యాగజైన్ ప్రతినిధులు సోమవారం మీడియాకు వెల్లడించారు. 2015లోనూ నరేంద్ర మోదీ టైమ్స్ రీడర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. కానీ ప్రధాన అవార్డు ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ మాత్రం జర్మన్ చాన్సలర్ ఏంజిలా మోర్కెల్‌కు దిక్కింది. ఓకే ఏడాది కాలంలో ప్రపంచాన్ని విపరీతంగా ప్రభావితం (మంచిగానో, చెడుగానో) చేసిన వ్యక్తులకు టైమ్స్ ప్రకటించే అవార్డును పలు దేశాలు, సంస్థలు విశిష్ఠంగా భావిస్తాయని తెలిసిందే.
ఇక 2016 పర్సన్ ఆఫ్ ది ఇయర్ రేసు విషయానికి వస్తే.. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 లక్షల మంది టైమక్స్ రీడర్లు పాల్గొనే ఓటింగ్‌లో ప్రస్తుతానికి మోదీ ముందంజలో ఉండగా, (ఇంతకు ముందే రెండుసార్లు అవార్డు అందుకున్న)అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 7 శాతం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 6 శాతం, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ 6 శాతం ఓట్లు సాధించారు. కాగా, వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే.. అన్నీ ‘ఎస్’ ఓట్లు సాధిస్తూ ట్రంప్‌కు గట్టి పోటి ఇస్తున్నారని టైమ్స్ ప్రతినిధులు తెలిపారు. వీళ్లే కాక టైమ్స్ పర్సన్ అఫ్ ది ఇయర్ అవార్డు రేసులో హిల్లరీ క్లింటన్, ఎఫ్‌బీఐ మాజీ చీఫ్ జేమ్స్ కామీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్, అమెరికన్ ముస్లిం సైనికుడి(హుమాయున్ ఖాన్) తల్లిదండ్రులు, ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్, బ్రిటన్ పీఎం థెరిసా మే, చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ తదితరులు ఉన్నారు.