అవినీతిరహిత పాలన అందిస్తాం
మంత్రి పీతల సుజాత
ఏలూరు : అవినీతికి తావులేని పారదర్శక పాలనను రాష్ట్ర ప్రజలకు అందిస్తామని రాష్ట్ర గనులు, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఏలూరు ఎంపీ మాగంటిబాబుతో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అవినీతిరహిత పాలనే తమ లక్ష్యమని, ఆ దిశగా అన్ని రంగాల్లో అభివృద్ధికి అధికారులను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ముందుకు వెళతామన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. తన శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పారు. జిల్లాలో వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ ప్రాంతంలో పాస్పోర్టు కార్యాలయం త్వరలో ప్రారంభినున్నట్టు చెప్పారు.
నవ్యాంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, ఏలూరు నగరాలను హైటెక్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి కష్టపడి పనిచేస్తామని చెప్పారు. అంతకుముందు ఎన్టీఆర్, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సుజాతకు పట్టుచీర పెట్టిన మాగంటి సతీమణి
స్థానిక ఆర్ఆర్పేటలో ఎంపీ మాగంటి ఇంటికి శనివారం ఉదయం చేరుకున్న మంత్రి సుజాతకు మాగంటి బాబు సతీమణి పద్మవల్లీ దేవి ఘనస్వాగతం పలికారు. మంత్రికి పద్మవల్లీదేవీ పట్టుచీర పెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుజాత మాగంటి బాబు దంపతులకు పాదాభివందనం చేశారు.