ఇష్టంగా అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకుందామని.. ఎప్పటికప్పుడు నేర్చుకోవడం ద్వారా పేదలకు సేవచేసే త త్వాన్ని అలవర్చుకుందామని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రతి నిధులకు పిలుపునిచ్చారు. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలని, రాష్ట్రంలోని పేదలంతా ఎలా బాగుపడాలో నేర్చుకుని వెళ్లాలని సూచించారు. పదవులు వచ్చినవారంతా గొప్పవాళ్లు కాదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు నాగార్జునసాగర్‌లోని విజ యవిహార్లో మూడు రోజుల రాజకీయ పునశ్చరణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ప్రముఖ ఆర్థికవేత్త సి.హెచ్.హనుమంతరావు, ఎన్నికల మాజీ ప్రధానాధికారి జె.ఎం.లింగ్డో, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కి) డెరైక్టర్ జనరల్ రవికాంత్‌లతో కలిసి కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత సీహెచ్ హనుమంతరావు, అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘మొదటిసారిగా మనం ఈ పునశ్చరణ తరగతులు నిర్వహించుకుంటున్నాం. ఇది పరస్పర అభిప్రాయాలను పంచుకునే వేదిక మాత్రమే. శిక్షణ తరగతులు కావు. కొందరికి ఇది పాతదే కావచ్చు. ఇది చాలా మంది మిత్రులకు కొత్తది. మనకు దేశస్థాయి అంశాలపై అవగాహన ఉన్న ఆర్థికవేత్త హనుమంతరావు అనేక విషయాలను చెప్పారు. మన మిషన్‌కాకతీయ లాంటి కార్యక్రమాలను ప్రశంసించారు. ఇలాంటి పునశ్చరణ తరగతులు ఆర్నెల్లకోసారి ఉంటాయి. అప్పుడు ఒక రోజు సెషన్ పెట్టుకుందాం.’’
నేర్చుకునే అక్కర లేదనుకోవద్దు..
‘‘ఏ దేశానికి లేని కొన్ని జబ్బులు, అలవాట్లు మన
దేశానికి ఉన్నాయి. ఇది వారసత్వంగా మనకు వచ్చింది. రాజకీయ నాయకులంటే ఇలా ఉండాలి. ఎమ్మెల్యే, మంత్రి, సీఎంలు ఇలానే ఉండాలని త యారు చేశారు. గౌరవంగా ఉండడంలో తప్పులేదు. నేర్చుకునే అక్కరలేదని అనుకోవడం మంచిది కా దు. మంత్రులు, ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి క్లాసులు చెబుతారా అనుకోవచ్చు. చాలా దేశాల్లో సీఎంలు, పీ ఎంలుగా పనిచేసిన వాళ్లు కూడా ఊరికే ఉండరు. ప దవీకాలం పూర్తయ్యాక ప్రొఫెసర్లుగా, రచయితలుగా పనిచేస్తారు. పేదలకు ఎంత మంచి చేశామన్నదానిపైనే జీవితసార్థకత ఉంటుంది.’’
పదవులొచ్చినంత మాత్రాన గొప్పవాళ్లం కాదు
‘‘పదవులు శాశ్వతం కాదు. మనకు పదవి వచ్చినంత మాత్రాన గొప్పవాళ్లం కాదు. మనకన్నా గొప్పవాళ్లు, మేధావులు చాలా మంది ఉంటరు. యాదృచ్ఛికంగా మాత్రమే మనకు ఈ పదవి వచ్చింది. ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేశాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు పురోగమన ప్రయత్నం చేద్దాం. ఉజ్వల భవిష్యత్ ఉన్నవాళ్లు, భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి వెళ్లేవారున్నారు. అలాంటివారు ఎంత గొప్పతనంతో పోతే అంత మంచిది. పుట్టినప్పుడే ఎవరూ అన్నీ నేర్చుకుని రారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన తర్వాత, ఈ సెషన్లు అయిపోయాక మనం ఏం నేర్చుకున్నామో తెలుస్తుంది. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసుకుం దాం. ఇక్కడ అన్ని విషయాలు నేర్చుకుని ముందుకెళదాం. మన రాష్ట్రం అన్ని విధాలుగా బాగుపడాలె. దేశంలోనే గొప్ప రాష్ట్రం కావాలె. అలా కావాలంటే చిత్తశుద్ధితో, క్రమపద్ధతిలో ముందుకు తీసుకుపోవాలె. ఏం చేయాలో ఇక్కడ నేర్చుకుని ముందుకెళదాం..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రపంచమంతా మెచ్చినా..
ఆర్థికవేత్త హనుమంతరావులాంటి వాళ్లు కోరుకుంటే గవర్నరో, రాజ్యసభ సభ్యుడో, కేంద్రమంత్రో అయి ఉండేవారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ కాలం నుంచి ఆయనకు గుర్తింపు ఉందని.. మాజీ ప్రధాని మన్మోహన్, హనుమంతరావు ఇద్దరూ సహచరులని చెప్పారు. ‘‘హనుమంతరావు గురించి మనకు ఇక్కడ తెలియదు కానీ, ఢిల్లీలో ఆయన పుస్తకావిష్కరణలు ఉంటే ఆయన శిష్యు లమని చెపుతూ వందలాది మంది వస్తారు. అదే హనుమంతరావు ఆంధ్రా ప్రాంతంలో పుట్టి ఉంటే ఆకాశానికి ఎత్తేవారు. గొప్పతెలివి ఉన్న వారిని కూడా సమైక్య రాష్ట్రంలో వెలుగులోకి రానీయలేదు. సిద్దిపేటకు చెందిన కాపు రాజయ్య గొప్ప కళాకారుడు. 76 దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. ప్రపంచమంతా మెచ్చినా ఇక్కడ మాత్రం గౌరవం రాలే. అందుకే పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
వాస్తవ పరిస్థితి చెప్పండి..
తెలంగాణ అధిక నిధులున్న రాష్ట్రమంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేయాలని, ఇక్కడి వాస్తవ పరిస్థితిని దేశమంతటా ప్రచారం చేయాలని కేసీఆర్ సూచించారు. ఆర్థికవేత్త హనుమంతరావు చెప్పిన విషయాలను కేసీఆర్ గుర్తుచేస్తూ.. ‘‘తెలంగాణలో ఎప్పుడూ నిధులకు కొరత లేదు. అయితే 60 ఏళ్లుగా వాటిని ఆంధ్రలో ఎక్కువగా ఖర్చు చేశా రు. అందుకే మన దగ్గర డబ్బుల్లేనట్లు కనిపిం చింది. కానీ ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చాక.. మన నిధులు మనం ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి నిధులెక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.’’ అని సీఎం పేర్కొన్నారు.
తుమ్మల మధ్యలోనే పారిపోయిండు..
విజన్-2020 డాక్యుమెంట్ తయారీ కోసం తాను హనుమంతరావు గారిని కలిశానని చెప్పి న కేసీఆర్... మంత్రి తుమ్మల వైపు చూస్తూ సరదాగా చమత్కరించారు. ‘‘అదుగో తుమ్మల నాగేశ్వరరావుగారు నవ్వుతున్నరు. ఆ డాక్యుమెంట్ కమిటీలో ఆయనా సభ్యుడే. కానీ మధ్యలోనే పారిపోయిండు. ఆయనే కాదు ఆ కమిటీలో సభ్యులంతా వెళ్లిపోయిండ్రు. ముఖ్యమంత్రి, శాఖల కార్యదర్శులు కూడా పారిపోయి బాధ్యత అంతా నా నెత్తిమీదే పెట్టిండ్రు. కాగా.. టీఆర్ఎస్ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావుతో పాటు రాష్ట్రానికి చెందిన అందరు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. తొలిరోజు హనుమంతరావు, లింగ్డో ప్రసంగించగా.. ప్రజాస్వామ్యం, సుపరిపాలన, విపత్తుల నిర్వహణ, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ సంబంధిత అంశాలపై పునశ్చరణ కార్యక్రమాలు నిర్వహించారు.
డిజిటల్ క్లాస్‌రూం..
సెలైంట్ స్టూడె ంట్స్
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు రాజకీయ పునశ్చరణ తరగతులు పకడ్బందీగా సాగుతున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన తరగతులు రాత్రి 9 గంటల వరకు సాగాయి. ఈ తరగతుల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు పాల్గొంటున్నారు. సీఎం కేసీఆర్ స్వయం పర్యవేక్షణలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన పలువురు శిక్షకులు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా స్లైడ్షోలు, గ్రాఫిక్స్, షార్ట్‌ఫిల్మ్‌లను ఉపయోగిస్తున్నారు. ఫొటోలు, విజువల్స్ ద్వారా సులభంగా అర్థమయ్యేలా చెబుతున్నారు. తరగతులు జరుగుతున్న హాల్ డి జిటల్ క్లాస్‌రూంను తలపిస్తోందని, ప్రజాప్రతినిధులంతా బుద్ధిమంతులైన విద్యార్థుల మాదిరి నిశ్శబ్దంగా పాఠాలు వింటున్నారని తరగతులకు హాజరైన ఒక సభ్యుడు వ్యాఖ్యానించారు. పునశ్చరణ సమయంలో ప్రతి సభ్యుడికి రెండు కార్డులివ్వగా, అందులో గులాబీ కార్డును ప్రశ్నల కోసం, పసుపు కార్డులను సందేహాలు, వివరణల కోసం ఉపయోగించుకుంటున్నారు. నిపుణులు విషయాలు చెపుతున్నప్పుడే సభ్యులకు వచ్చిన ప్రశ్నలు, సందేహాలు, వివరణలను ఆ కార్డులపై రాసి ఇక్కడ ఉన్న ఆస్కి ప్రతినిధులకిస్తే అనంతరం వారి సందేహాలను కూడా నివృత్తి చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అనే అంశంపై జరిగిన తరగతిలో మొత్తం 70 మంది సభ్యులు సందేహాలు, ప్రశ్నలను కార్డులపై రాసినట్టు తెలిసింది. ప్రతి సెషన్ రెండు గంటలు ఉంటుండగా, అందులో గంట పాటు నిపుణులు ప్రసంగం... మరో గంట ఇంటరాక్టివ్ సెషన్ ఉంటోంది.
ధర్మకర్తలా ఉండండి
ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించే ప్రభుత్వ ధనానికి ప్రజాప్రతినిధులు ధర్మకర్తలుగా ఉండాలి. ముఖ్యంగా కల్యాణలక్ష్మి లాంటి పథకాలు దళారీల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వమంటే డబ్బులివ్వడమే కాదు మంచి విధానాలను రూపొందించాలి. ప్రభుత్వ కార్యకలాపాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా ప్రజలు కూడా తమ వంతు భాగస్వామ్యం అందించాలి. సూరత్ పట్టణంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ప్రజల సహకారంతోనే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాప్రతినిధులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కర్తవ్యాన్ని నెరవేర్చాలి.
తొలిరోజు ఏంచెప్పారు?
పునశ్చరణ తరగతుల్లో తొలిరోజు ఐదు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యం -అధికార వికేంద్రీకరణపై రిటైర్డ్ ప్రొఫెసర్ రవీంద్రశాస్త్రి, గుడ్గవర్నెన్స్పై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారిణి లక్ష్మి, గ్రీన్‌కవర్ అనే అంశంపై ఐఎఫ్ఎస్ అధికారి తిరుపతయ్య, వేస్ట్ మేనేజ్మెంట్పై రవికాంత్, గ్రామీణ, పట్టణాభివృద్ధిపై ఆస్కి డెరైక్టర్ శ్రీనివాసాచారి సభ్యులకు అవగాహన కల్పించారు. మెకాలే విద్యావిధానం, 1935 భారత చట్టాలు, స్వాతంత్య్రానంతరం దేశ పయనం గురించి కూడా చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడం ఎలా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, సేవలు సకాలంలో అందించడం, ప్రజలకు బాధలు, సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడం, ప్రజల నుంచి స్పందన తీసుకోవడం లాంటి అం శాల గురించి వివరించారు. సాగు, తాగునీరు, నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
టీఆర్ఎస్ పునశ్చరణ
కేజీ టు పీజీతో ఉపయోగం
రాష్ట్రస్థాయిలో తయారుచేసే ప్రణాళికలు పటిష్టంగా ఉండాలి.. అలాగే రాష్ట్ర ప్రణాళికా సంఘాలకు స్వయంప్రతిపత్తి కల్పించి దీర్ఘకాలికంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పుడే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలు పటి ష్టంగా ఉంటేనే గ్రామస్వరాజ్యం సాధ్యం. విద్య ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించవచ్చు. ఆ దిశలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కేజీ టు పీజీ విద్య దోహదపడుతుంది. దేశంలో ఐటీ, పంచాయతీరాజ్ వ్యవస్థల్లో సంస్కరణలు రాజీవ్‌గాంధీ హయాంలో ప్రారంభం కాగా, వాటిని పీవీ నరసింహారావు ప్రభుత్వం కొనసాగించింది.
- ఆర్థికవేత్త సీహెచ్ హనుమంతరావు
చిత్తశుద్ధితోనే సుపరిపాలన
రాజకీయ చిత్తశుద్ధి, చట్టసభల్లోకి వెళ్లేవారి పనితీరును బట్టే సుపరిపాలన సాధ్యమవుతుంది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలసి పనిచేసి, వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలి. సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేలు.. జూనియర్ ఎమ్మెల్యేలకు సూచనలు చేయాలి.
-కేంద్ర ఎన్నికల మాజీ ప్రధానాధికారి లింగ్డో
రెండు రోజుల్లో మారిపోతారు
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల అనంతరం ఆ ప్రజాప్రతినిధులు ఎంతో మారిపోతారు. ఆస్కి ఆధ్వర్యంలో గత నెలలో దేశంలో ఉన్న ఐఏఎస్ అధికారులందరికీ శిక్షణనిచ్చాం.. అనంతరం వారు కూడా ఈ శిక్షణ ద్వారా ఎంతో నేర్చుకున్నామని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది.
-అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) డెరైక్టర్ జనరల్ రవికాంత్
పకడ్బందీగా పునశ్చరణ
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల రాజకీయ పునశ్చరణ తరగతులు పకడ్బందీగా సాగుతున్నాయి. దాదాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలంతా హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచీ తొలిరోజు కార్యక్రమం ముగిసేవరకు అందరూ క్లాసులకు హాజరయ్యారు. మంత్రు లు, ఎమ్మెల్యేలంతా నోట్ పుస్తకాల్లో రాసుకున్నా రు. సీఎం కేసీఆర్ కూడా నోటు పుస్తకంలో కొన్ని విషయాలను నోట్ చేసుకున్నారు. ప్రతి సభ్యుడు తరగతి గదిలో విద్యార్థుల్లా వ్యవహరిస్తున్నారని తరగతులకు హాజరైన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. పునశ్చరణ సమయంలో ప్రతి సభ్యుడికి రెండు కార్డులివ్వగా, అందులో గులాబీ కార్డును ప్రశ్నల కోసం, పసుపు కార్డులను సందేహాలు, వివరణల కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రశ్న లు, సందేహాలు, వివరణలను ఆ కార్డులపై రాసి ఇక్కడ ఉన్న ఆస్కి ప్రతినిధులకిస్తే అనంతరం వారి సందేహాలను కూడా నివృత్తి చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అనే అంశంపై జరిగిన తరగతిలో మొత్తం 70 మంది సభ్యులు సందేహాలు, ప్రశ్నలను కార్డులపై రాసినట్టు తెలిసింది. ప్రతి సెషన్ రెండు గంటలు ఉంటోంది.
- సాక్షి ప్రతినిధి, నల్లగొండ