umabharati
-
బాబ్రీ కూల్చివేత కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ : వివాదాస్పద బాబ్రీ మసీదు విధ్వంసం కేసు విచారణను సుప్రీంకోర్టు రెండువారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 6తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీ, ఉమాభారతి సహా 13మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలు తొలగించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై నిన్న విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ్టికి కేసు వాయిదా వేసింది. మరోవైపు కుట్ర అభియోగాలకు సంబంధించి తమ వాదనలు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. వాస్తవానికి ఈ అంశంపై బుధవారమే తీర్పు రావాల్సి ఉన్నా జడ్జి గైర్హాజరుతో తీర్పు ఇవాళ్టికి వాయిదా పడింది. అయితే ఇవాళ కూడా తీర్పు ప్రకటించలేదు. కాగా బాబ్రీ ఘటనకు సంబంధించి అద్వానీ, వినయ్ కటియార్, కళ్యాణ్ సింగ్ సహా 13 మంది బీజేపీ నేతలపై కేసు నమోదైంది. అయితే అద్వానీ సహా 12 మందిపై నమోదైన కుట్ర అభియోగాలను లక్నోలోని ట్రయల్ కోర్టు కొట్టేయగా... అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ నిర్ణయాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఈ నెల 6వ తేదీన విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కుట్ర అభియోగాల తొలగింపును తప్పుబట్టింది. -
'కృష్ణా' వివాద పరిష్కారంపై భేటీకి సన్నాహాలు
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల వివాద పరిష్కారానికి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఇరురాష్ట్రాల మంత్రులతో భేటీకానున్నారు. త్వరలో కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి సమక్షంలో ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఉమాభారతి మంత్రులతో భేటీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భేటీలో ఇరురాష్ట్రాల నుంచి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఏపీ సాగునీటి శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరుకానున్నారు. -
హరీశ్ రావు ఢిల్లీ పర్యటన రద్దు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన రద్దు అయింది. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి శనివారం హరీశ్‌రావుకు ఫోన్ కాల్ చేశారు. అధికారులు అందుబాటులో లేనందున సోమవారం రావాలని ఆమె సూచించారు. కాగా షెడ్యూల్ ప్రకారం అయితే హరీశ్‌రావు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అక్రమమంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇప్పటికే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటూ హరీశ్ ...జలవనరుల శాఖమంత్రిని కలవనున్నారు. ఏపీ అసత్య ప్రచారం చేస్తోందంటూ ఆయన ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. హరీశ్‌తో పాటు పార్టీ ఎంపీలు కూడా ఉమా భారతితో సోమవారం భేటీ అవుతారు. -
ఉమాభారతిని కలిసిన చంద్రబాబు
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఉమాభారతిని కోరారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిశారు. ఈ సందర్భంగా..కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం సాయమందించాలని కోరారు. నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శ రాష్ట్రంగా గుర్తించాలని కోరారు. -
పార్లమెంట్‌కు సీఎం కేసీఆర్
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, తెలంగాణకు ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సహకాలు, అధికారుల పంపకాలు సహా పలు అంశాలను శాఖల వారీగా కేంద్రమంత్రులకు ఈ సందర్భంగా కేసీఆర్ మరోసారి గుర్తు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, రైల్వేమంత్రి సురేశ్ ప్రభుత తదితరులను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ...అవకాశాన్ని బట్టి మంత్రులందరనీ పార్లమెంట్‌లోని వారి చాంబర్లలో కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు మధ్యాహ్నం 1.15గంటలకు కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతితో కేసీఆర్ సమావేశం అవుతారు. అలాగే ఈరోజు సాయంత్రం కేసీఆర్..హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం. -
కేంద్రమంత్రి ఉమాభారతితో హరీష్ రావు భేటీ
న్యూఢిల్లీ : శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి వివాదం హస్తినకు చేరింది. కృష్ణా బోర్డు తీర్పుపై మండిపడుతున్న తెలంగాణ సర్కారు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం కేంద్రమంత్రి ఉమా భారతితో భేటీ అయ్యారు. కృష్ణా బోర్డు తీర్పును రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ మేరకు ఉమాభారతికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు ఓ వినతిపత్రం సమర్పించారు. కాగా ఇందుకు సంబంధించి మధ్యాహ్నం రెండున్నర గంటలకు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని ఉమాభారతి హామీ ఇచ్చారు. దాంతో ఈ వివాదంపై మధ్యాహ్నం తర్వాత ఓ స్పష్టత రానుంది.