University of Minnesota
-
వాయుకాలుష్యంతో రక్తం గడ్డకట్టే ముప్పు
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం మానవుల ప్రాణాలకు అత్యంత హానికరమని మరోసారి రుజువైంది. దీర్ఘకాలంపాటు వాయుకాలుష్యం బారిన పడితే నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఏకంగా 39 శాతం నుంచి 100 శాతందాకా పెరుగుతాయని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 17 సంవత్సరాలపాటు అమెరికాలో 6,650 మంది యుక్తవ యస్కు లపై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. ‘‘వాయు కాలుష్యం కారణంగా కణజాలం, కండరాల కింద ఉండే ప్రధాన నరాల్లో రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరగొచ్చు. చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే రక్తప్రవాహానికి తీవ్ర అవరోధాలు ఏర్పడి ప్రసరణ ఆగిపోవచ్చు. అప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి’’ అని పరిశోధకులు చెప్పారు. నరాల్లో రక్తం గడ్డ కట్టే పరిస్థితిని వేనస్ థ్రోంబోఎంబోలిజం’ అని పిలుస్తారు. ఈ సమస్య కారణంగా ఆస్పత్రిపాలైన రోగుల డేటాను మిన్నెసోటా విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం పరిశీలించింది. ఆయా రోగుల ఇళ్లలో వాయుకాలుష్యం తాలూకు శాంపిళ్లనూ తీసు కున్నారు. న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజెలిస్ సహా ఆరు మెట్రోపాలిటన్ నగరాల్లో, ఆ నగరాల సమీపాల్లో నివసించే యుక్తవయసు రోగులపై ఈ పరిశోధన చేశారు. సూక్ష్మధూళి కణాలు(పీఎం 2.5) , నైట్రోజన్ ఆక్సైడ్ల బారిన పడి వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న వారిలో 3.7 శాతం(248 మంది) జనాభాలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు 39 శాతం నుంచి 100 శాతం వరకు ఉన్నాయి. సూక్ష్మధూళి కణాల గాఢత ఎంత ఎక్కువ ఉన్న గాలిని పీల్చితే అంత ఎక్కువగా రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరుగుతాయి. అత్యధిక స్థాయిలో నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ల బారిన పడితే ఈ రిస్క్ ఏకంగా 120–174 శాతానికి పెరుగుతుంది. వాయు కాలుష్యం ఎక్కువైతే శరీరంలో ఆ మేరకు వాపు పెరిగి రక్తం గడ్డకడుతుంది. చివరకు ఆ వ్యక్తులు హృదయ, శ్వాస సంబంధ వ్యాధుల బారిన పడతారు’’ అని పరిశోధకులు చెప్పారు. -
పొడగరి మగాళ్లకు పేగు కేన్సర్ రిస్కు!
పరిపరి శోధన పొడగరి మగాళ్లకు పేగు కేన్సర్ రిస్కు ఎక్కువట. పొట్టిగా ఉండేవాళ్లతో పోలిస్తే పొడగరి మగాళ్లకు.. ముఖ్యంగా కాళ్ల పొడవు 90 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండే వాళ్లకు పేగు కేన్సర్ సోకే అవకాశాలు 42 శాతం ఎక్కువగా ఉంటాయని ఒక తాజా అధ్యయనంలో తేలింది. మిన్నెసోటా వర్సిటీ శాస్త్రవేత్తలు 14,500 మందిపై జరిపిన విస్తృత అధ్యయనంలో ఈ విషయాన్ని నిగ్గుతేల్చారు. పొడుగు పెరగాలని చాలామంది ఉబలాట పడుతుంటారు గానీ, పొడగరులతో పోలిస్తే పొట్టివారిలోనే పేగులు సురక్షితంగా ఉంటాయని మిన్నెసోటా పరిశోధకులు చెబుతున్నారు. -
ధనమేరా అన్నిటికీ మూలం...
పరిపరి శోధన ‘ధనమేరా అన్నిటికీ మూలం...’ అని తెలుగు సినీకవి ఏనాడో చెప్పిన మాట అక్షర సత్యమని ఒక తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా డబ్బు మనుషుల్లో స్వార్థాన్ని పెంచుతుందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని మిన్నెసోటా వర్సిటీకి చెందిన కార్ల్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇల్లినాయీ వర్సిటీ పరిశోధకులు వివిధ దేశాలకు చెందిన 550 మంది చిన్నారులపై పరీక్షలు జరిపి ఈ విషయాన్ని నిగ్గు తేల్చారు. మూడు నుంచి ఆరేళ్ల వయసు లోపు పిల్లల చేతికి డబ్బు ఇచ్చి, వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలించారు. ఆ వయసు చిన్నారులకు డబ్బు విలువ అర్థం కాకున్నా, చేతికి డబ్బు వచ్చే సరికి వారి ప్రవర్తన స్వార్థపూరితంగా మారిందని ఈ పరిశోధకులు చెబుతున్నారు. -
అంటార్కిటికా కొండకు భారత-అమెరికన్ పేరు
వాషింగ్టన్: భారత-అమెరికా శాస్త్రవేత్తను అమెరికా అరుదైన గౌరవంతో సత్కరించింది. అంటార్కిటికాలో ఓ పర్వతానికి ఆయన పేరు పెట్టింది. జంతు జనాభాకు సంబంధించి కీలక వివరాలు సేకరించడంతోపాటు అనేక పరిశోధనలు చేసిన ప్రముఖ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలోని జెనిటిక్స్, సెల్ బయాలజీ విభాగం ప్రొఫెసర్ అఖౌరీ సిన్హాకు ఈ గౌరవం లభించింది. 1971-72లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అంటార్కిటికాలోని 990 మీటర్లు ఎతున్న ఓ పర్వతానికి మౌంట్ సిన్హా అని పేరు పెడుతూ అంటార్కిటిక్ పేర్లపై ఏర్పాటైన సలహా కమిటీ, అమెరికా జియలాజికల్ సర్వేలు నిర్ణయం తీసుకున్నాయి. బెల్లింగ్షాసెన్, అమండ్సెన్ సముద్ర ప్రాంతాల్లో సీల్స్, వేల్స్, పక్షుల జనాభాపై అధ్యయనం చేసిన బృందంలో సిన్హా సభ్యుడు కావడంతో ఈ మేరకు ఆయన్ను సత్కరించారు. 1954లో అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ సాధించిన సిన్హా.. 1956లో పాట్నా యూనివర్సిటీ నుంచి జువాలజీలో ఎంఎస్సీ పూర్తిచేశారు. అనంతరం 1956 నుంచి 1961 జూలై వరకు రాంచీ కాలేజీలో జువాలజీ బోధించారు. తర్వాత అమెరికా వెళ్లారు.