అంటార్కిటికా కొండకు భారత-అమెరికన్ పేరు
వాషింగ్టన్: భారత-అమెరికా శాస్త్రవేత్తను అమెరికా అరుదైన గౌరవంతో సత్కరించింది. అంటార్కిటికాలో ఓ పర్వతానికి ఆయన పేరు పెట్టింది. జంతు జనాభాకు సంబంధించి కీలక వివరాలు సేకరించడంతోపాటు అనేక పరిశోధనలు చేసిన ప్రముఖ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలోని జెనిటిక్స్, సెల్ బయాలజీ విభాగం ప్రొఫెసర్ అఖౌరీ సిన్హాకు ఈ గౌరవం లభించింది. 1971-72లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అంటార్కిటికాలోని 990 మీటర్లు ఎతున్న ఓ పర్వతానికి మౌంట్ సిన్హా అని పేరు పెడుతూ అంటార్కిటిక్ పేర్లపై ఏర్పాటైన సలహా కమిటీ, అమెరికా జియలాజికల్ సర్వేలు నిర్ణయం తీసుకున్నాయి.
బెల్లింగ్‌షాసెన్, అమండ్సెన్ సముద్ర ప్రాంతాల్లో సీల్స్, వేల్స్, పక్షుల జనాభాపై అధ్యయనం చేసిన బృందంలో సిన్హా సభ్యుడు కావడంతో ఈ మేరకు ఆయన్ను సత్కరించారు. 1954లో అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ సాధించిన సిన్హా.. 1956లో పాట్నా యూనివర్సిటీ నుంచి జువాలజీలో ఎంఎస్సీ పూర్తిచేశారు. అనంతరం 1956 నుంచి 1961 జూలై వరకు రాంచీ కాలేజీలో జువాలజీ బోధించారు. తర్వాత అమెరికా వెళ్లారు.