users personal data
-
ఫొటోలను గూగుల్ ఫొటోస్‌లో స్టోర్ చేస్తున్నారా?
గూగుల్ ఫొటోస్.. ఫొటోలు, వీడియోల బ్యాకప్ కోసం ఉపయోగిస్తున్న గూగుల్ బేస్డ్ ఫ్రీ యాప్. చాలామంది ఇందులో ఫొటోలు, వీడియోలను భద్రంగా ఉన్నాయనుకుంటారు. ఆటోమేటిక్‌గా ఫొటోలు అందులోకి వెళ్తున్నాయని భావిస్తుంటారు. కానీ, గూగుల్ ఫొటోస్‌కూ ఓ పరిమితి అంటూ ఉంటుంది. అది దాటినా.. లేదంటే ఫుల్ మొమరీతో ఎక్కువ కాలం నడిపించినా.. ఆ మొత్తం ఫొటోలు, వీడియోలు ఎగిరిపోతాయని మీకు తెలుసా?. కాబట్టి, గూగుల్ ఫొటోస్‌కు సంబంధించి ఈ విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడండి. గూగుల్ ఫొటోస్ యాప్ కోసం ప్రతీ గూగుల్ అకౌంట్‌కు ఉచితంగా కొంత స్పేస్ ఇస్తుంది గూగుల్. ఇందులో ఎక్స్‌ప్రెస్, స్టోరేజ్ సేవర్, ఒరిజినల్ క్వాలిటీ అనే ఆప్షన్లు ఉంటాయి. ఒకవేళ ఒరిజినల్ క్వాలిటీని గనుక క్లిక్ చేయకపోతే.. ఫొటోలు, వీడియోలు మంచి క్వాలిటీతో సేవ్ కావు. అప్పుడు ఫొటోలు తక్కువ సైజులో సేవ్ అయ్యి.. ఆ ఫొటోలు, వీడియోలు బ్లర్‌గా గూగుల్ ఫొటోల్లో కనిపిస్తుంటాయి. చాలామంది గూగుల్ ఫొటోస్‌లో స్పేస్ కోసం తక్కువ క్వాలిటీకే ప్రయారిటీ ఇస్తారు. కానీ, క్వాలిటీ ఫొటోల్ని దాచుకోవాలనుకుంటే.. ఒరిజినల్ క్వాలిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయకతప్పదు. స్టోరేజ్ మించితే.. గూగుల్ అకౌంట్ స్టోరేజ్‌లో గూగుల్ డ్రైవ్ మాదిరిగానే.. గూగుల్ ఫొటోస్కి కూడా 15 జీబీ స్పేస్ ఇస్తుంది గూగుల్. ఈ పరిమితి దాటిపోతే.. తర్వాతి నుంచి తీసే ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఆటోమేటిక్‌గా సేవ్ కావు. అప్పుడు ఆల్రెడీ సేవ్ అయి ఉన్న డాటాపై(ఆల్రెడీ ఉన్న ఫొటోలు, వీడియోపై) ప్రభావం పడే ఛాన్స్ ఉంది. కాబట్టి, గూగుల్ వన్ సబ్ స్క్రిప్షన్ ద్వారా అదనపు స్టోరేజ్‌ను గూగుల్ ఫొటోస్ కోసం కొనుక్కోవచ్చు. ఒకవేళ కొనుక్కోకపోతే.. గూగుల్ ఫొటోస్ పూర్తి కోటా అయిపోయినా(15 జీబీ పూర్తి కావడం), లేకుంటే అదనపు స్టోరేజ్‌ను కొనుక్కోకపోయినా.. ఆ తర్వాతి ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్ బ్యాకప్‌కు వెళ్లవు. అంటే.. స్టోర్ కావన్నమాట. ఒకవేళ ఓవర్ కోటాతో అలాగే గూగుల్ ఫొటోస్ యాప్‌ను 24 నెలలపాటు నడిపిస్తే.. ఆల్రెడీ అందులో ఉన్న ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, గూగుల్ ఫొటోస్ మొమరీ ఫుల్ అయితే గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఉపయోగించడం ఆపేయాలి(సెట్టింగ్స్ ద్వారా). గూగుల్ చెబుతుంది జీమెయిల్గానీ, గూగుల్ ఫొటోస్గానీ, గూగుల్ డ్రైవ్గానీ(గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్, డ్రాయింగ్స్, ఫామ్స్, జామ్బోర్డ్, సైట్స్ ఫైల్స్) ఏదైనా సరే.. రెండేళ్లపాటు ఉపయోగించకుండా ఉంటే అందులో ఉండే మొత్తం కంటెంట్, డాటా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. అయితే అలా చేయడానికి కంటే ముందు ఈ-మెయిల్స్, నోటిఫికేషన్స్ ద్వారా గూగుల్ తన యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది కూడా. ఇక డిలీట్ చేయడానికి మూడు నెలల ముందు యూజర్‌ను మరోసారి అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు ఆ టైంలో కంటెంట్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఒకవేళ జీమెయిల్, డ్రైవ్‌ల విషయంలో యాక్టివ్‌గా ఉండి.. గూగుల్ ఫొటోస్ను రెండేళ్లపాటు పట్టించుకోకుండా ఉన్నారనుకోండి. గూగుల్ ఫొటోస్‌లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని గూగుల్ తొలగిస్తుంది. డేటా డిలీట్ కాకుండా ఉండాలంటే.. తరచూ గూగుల్ అకౌంట్‌కు లాగిన్ అయ్యి.. ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోలను చెక్ చేస్తూ ఉండాలి(వెబ్ లేదా యాప్‌లో అయినా సరే). అవసరం లేని ఫొటోలు, వీడియోలు, కంటెంట్‌ను తీసేస్తూ.. ఫ్రీ స్పేస్‌ను మెయింటెన్ చేస్తూ ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చాలామంది ఒకే ఫోన్లో రెండు, మూడు గూగుల్ అకౌంట్లను మెయింటెన్ చేస్తుంటారు. కాబట్టి, అన్ని అకౌంట్లకు సంబంధించిన ఫొటోస్, డ్రైవ్, జీమెయిల్ అకౌంట్లను తప్పనిసరిగా వెరిఫై చేస్తూ ఉండాలి. ఇదీ చదవండి: ఇంట్లో కరెంట్ బోర్డు సమస్యలను ఇలా గుర్తించొచ్చు! -
మరోసారి ఫేస్బుక్ డేటా లీక్, 50 కోట్ల యూజర్లకు షాక్!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ యూజర్లూ జరభద్రం! మీ పర్సనల్ సమాచారాన్ని, ఫోన్ నంబర్‌ను ఆన్లైన్లో వేలానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫేస్బుక్ డేటా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హ్యాకర్ల కోసం ఫేస్బుక్ డేటాను ఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ప్రచారం జరగుతోంది. అయితే ఈ డేటా లీక్ విషయం చాలా పాతదే అయినా.. మరోసారి భారీ ఎత్తున డేటా లీక్ అయిందన్న సమాచారం మాత్రం ప్రస్తుతం ఫేస్బుక్ యూజర్లలో కలకలం రేపుతోంది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్సైట్ల నుంచి ఈ డేటా సేకరించి ఆన్లైన్లో పెట్టినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఇన్సైడర్ శనివారం తన కథనంలో పేర్కొంది. కాగా, 106 దేశాల్లో ఫేస్బుక్ వాడుతున్నవారి ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్‌లు ఆన్లైన్లో లీక్ అయ్యాయని చెప్పుకొచ్చింది. ఫేస్బుక్ డేటా లీక్‌తో సుమారు 1.1 కోట్ల యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది. అయితే, ఫేస్బుక్ డేటా లీక్ సమస్య ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా ఉన్నదే. ఫేస్బుక్ 2018 లో ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్లను సెర్చ్ చేసే ఆప్షన్‌ను తీసివేసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం తర్వాత ఫేస్బుక్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కేంబ్రిడ్జ్ అనలిటికా 8.7 కోట్ల ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిందన్న వార్తలు అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఫేస్బుక్ లీక్ డేటా చాలా పాతదని, 2019లోనే తమకు సమాచారం అందిందని, 2019 ఆగస్టులోనే ఈ సమస్యను పరిష్కరించామని ఫేస్బుక్ క్లారిటీ ఇచ్చింది. చదవండి: వెనుజులా అధ్యక్షుడి ఫేస్బుక్ ఖాతా నిలిపివేత..! -
ట్విటర్ కూడా డేటాను అమ్ముకుందట!
లండన్ : ఫేస్బుక్కే కాదు... ట్విటర్ కూడా తమ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను మరో కంపెనీకి అమ్ముకుందట. ఖాతాదారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే ట్విటర్ కూడా కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కంపెనీకే సమాచారాన్ని అమ్ముకుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేగాక ఫేస్బుక్ వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన అలెగ్జాండర్ కోగన్‌కే ట్విటర్ ఈ డేటాను విక్రయించినట్లు సండే టెలిగ్రాఫ్ అనే పత్రిక తన కథనంలో పేర్కొంది. దాని ప్రకారం.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన అలెగ్జాండర్ కోగన్.. ‘పర్సనాలిటీ క్విజ్’ యాప్‌ను తయారుచేశాడు. ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే ఫేస్బుక్ ద్వారా లాగిన్ కావాలి. అలా దాదాపు 8.7కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల డేటాను కోగన్ సేకరించి కేంబ్రిడ్జ్ అనలిటికాకు అందించాడు. కాగా.. కోగన్‌కు సొంతంగా గ్లోబల్ సైన్స్ రీసెర్చ్(జీఎస్ఆర్) అనే సంస్థ ఉంది. ఈ సంస్థ ద్వారా ట్విటర్ నుంచి యూజర్ల డేటాను తీసుకున్నాడు. ఇందుకోసం 2015లో జీఎస్ఆర్ సంస్థకు ట్విటర్ వన్‌టైం అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్ఫేస్ యాక్సెస్ కల్పించింది. 2014 డిసెంబరు నుంచి 2015 ఏప్రిల్ వరకు యూజర్ల పబ్లిక్ ట్వీట్ల రాండమ్ శాంపిల్ కోసం ఒకరోజు యాక్సెస్ కల్పించామని ట్విటర్ కూడా అంగీకరించింది. ఈ సమయంలోనే ఖాతాదారుల వ్యక్తిగత సమాచారమంతా జీఎస్ఆర్కు చేరిఉంటుంది. ఈ సమాచారం కోసం జీఎస్ఆర్ తమకు కొంత మొత్తాన్ని కూడా చెల్లించినట్లు ట్విటర్ తెలిపింది. -
షాకింగ్ : యాప్స్ పర్సనల్ డేటాను షేర్ చేస్తున్నాయ్
లండన్ : ఇటీవల యాప్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. నిత్యావసరాల నుంచి హెల్త్ టిప్స్ వరకు ప్రతి దానికోసం ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ యాప్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ యాప్స్ తో అప్రమత్తంగా ఉండాల్సినవసరం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది.. 70 శాతానికి పైగా స్మార్ట్ ఫోన్ యాప్స్ యూజర్ల వ్యక్తిగత డేటాను థర్డ్ పార్టీ కంపెనీలకు అంటే ఫేస్ బుక్, గూగుల్ లాంటి కంపెనీలకు షేర్ చేస్తున్నాయని స్పెయిన్ లోని ఐఎండీఈఏ నెట్ వర్క్స్ పరిశోధకులు వెల్లడించారు. ఓ వైపు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్ తన యూజర్ల డేటాను ఫేస్ బుక్ కు షేర్ చేస్తున్నట్టు ప్రకటించడంతో చాలా దేశాలు ఆ కంపెనీపై మండిపడుతున్నాయి. యూజర్ల డేటాను షేర్ చేయడం వ్యక్తిగత ప్రైవసీకి భంగకరమని పేర్కొన్నాయి. తాజాగా ఈ అధ్యయనం వెల్లడించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే యూజర్లు కొత్త స్మార్ట్ ఫోన్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటుంటారో, అప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం యాప్స్ పర్మిషన్ కూడా అడుగుతాయి. ఒక్కసారి యాప్ కు అనుమతి ఇచ్చినట్టైతే, ఇది ఎవరికైనా మీ డేటాను షేర్ చేస్తుందని పరిశోధకులు చెప్పారు. అప్పుడు థర్డ్ పార్టీ కంపెనీలు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ట్రాక్ చేస్తుంటాయని పేర్కొన్నారు. ఉచిత ఆండ్రాయిడ్ యాప్ లుమెన్ ప్రైవసీ మానిటర్ ను తమకోసం ప్రత్యేకంగా రూపొందించుకుని, స్మార్ట్ ఫోన్ల నుంచి ఏ డేటాను సేకరిస్తున్నారు, వేటిని బదిలీచేస్తున్నారో అనాలిసిస్ చేశామని రీసెర్చర్లు తెలిపారు. ఈ అధ్యయనంలో 70 శాతానికి పైగా యాప్స్ యూజర్ల వ్యక్తిగత డేటా థర్డ్ పార్టీ కంపెనీలకు షేర్ అవుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. 2015 అక్టోబర్ నుంచి లుమెన్ యాప్ వాడిన 1600 మంది యూజర్ల 5000కు పైగా యాప్స్ పై అధ్యయనం చేసినట్టు పరిశోధకులు చెప్పారు.. ఏ యాప్స్ యూజర్ల డివైజ్ లో రన్ అవుతున్నాయి? వారు ఎవరైనా రహస్యంగా ఉంచాల్సిన సున్నితమైన డేటాను షేర్ చేస్తున్నారా? అయితే ఎలాంటి సమాచారాన్ని ప్రతి యాప్ ప్రతి సైట్ కు పంపిస్తోంది? వంటి వాటిపై లుమెన్ ద్వారా ట్రాక్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.