షాకింగ్ : యాప్స్ పర్సనల్ డేటాను షేర్ చేస్తున్నాయ్
షాకింగ్ : యాప్స్ పర్సనల్ డేటాను షేర్ చేస్తున్నాయ్
Published Mon, Jun 12 2017 6:06 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
లండన్ : ఇటీవల యాప్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. నిత్యావసరాల నుంచి హెల్త్ టిప్స్ వరకు ప్రతి దానికోసం ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ యాప్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ యాప్స్ తో అప్రమత్తంగా ఉండాల్సినవసరం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది.. 70 శాతానికి పైగా స్మార్ట్ ఫోన్ యాప్స్ యూజర్ల వ్యక్తిగత డేటాను థర్డ్ పార్టీ కంపెనీలకు అంటే ఫేస్ బుక్, గూగుల్ లాంటి కంపెనీలకు షేర్ చేస్తున్నాయని స్పెయిన్ లోని ఐఎండీఈఏ నెట్ వర్క్స్ పరిశోధకులు వెల్లడించారు. ఓ వైపు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్ తన యూజర్ల డేటాను ఫేస్ బుక్ కు షేర్ చేస్తున్నట్టు ప్రకటించడంతో చాలా దేశాలు ఆ కంపెనీపై మండిపడుతున్నాయి. యూజర్ల డేటాను షేర్ చేయడం వ్యక్తిగత ప్రైవసీకి భంగకరమని పేర్కొన్నాయి. తాజాగా ఈ అధ్యయనం వెల్లడించిన విషయం చర్చనీయాంశంగా మారింది.
ఎప్పుడైతే యూజర్లు కొత్త స్మార్ట్ ఫోన్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటుంటారో, అప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం యాప్స్ పర్మిషన్ కూడా అడుగుతాయి. ఒక్కసారి యాప్ కు అనుమతి ఇచ్చినట్టైతే, ఇది ఎవరికైనా మీ డేటాను షేర్ చేస్తుందని పరిశోధకులు చెప్పారు. అప్పుడు థర్డ్ పార్టీ కంపెనీలు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ట్రాక్ చేస్తుంటాయని పేర్కొన్నారు. ఉచిత ఆండ్రాయిడ్ యాప్ లుమెన్ ప్రైవసీ మానిటర్ ను తమకోసం ప్రత్యేకంగా రూపొందించుకుని, స్మార్ట్ ఫోన్ల నుంచి ఏ డేటాను సేకరిస్తున్నారు, వేటిని బదిలీచేస్తున్నారో అనాలిసిస్ చేశామని రీసెర్చర్లు తెలిపారు. ఈ అధ్యయనంలో 70 శాతానికి పైగా యాప్స్ యూజర్ల వ్యక్తిగత డేటా థర్డ్ పార్టీ కంపెనీలకు షేర్ అవుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు.
2015 అక్టోబర్ నుంచి లుమెన్ యాప్ వాడిన 1600 మంది యూజర్ల 5000కు పైగా యాప్స్ పై అధ్యయనం చేసినట్టు పరిశోధకులు చెప్పారు.. ఏ యాప్స్ యూజర్ల డివైజ్ లో రన్ అవుతున్నాయి? వారు ఎవరైనా రహస్యంగా ఉంచాల్సిన సున్నితమైన డేటాను షేర్ చేస్తున్నారా? అయితే ఎలాంటి సమాచారాన్ని ప్రతి యాప్ ప్రతి సైట్ కు పంపిస్తోంది? వంటి వాటిపై లుమెన్ ద్వారా ట్రాక్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
Advertisement