జనాభిమానం
సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడోవిడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలో భాగంగా ఆరవరోజైన శుక్రవారం ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. దారిపొడవునా వేలాదిమంది హారతులు, మేళతాళాలు, కోలాటాలతో ఆహ్వానం పలికారు. దామలచెరువు నుంచి బయలుదేరిన ఆయన నాలుగు చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.
పాకాలలో వైఎస్.రాజశేఖరరెడ్డి మృతికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విజయకుమార్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. వారికి మనోధైర్యం కల్పించారు. దామలచెరువు నుంచి బండార్లపల్లెకు చేరుకుని అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుమ్మడివారిపల్లెకు చేరుకున్న జగన్మోహన్రెడ్డికి టపాకాయలు పేల్చి, హారతులతో ఆహ్వానం పలికారు.ఊట్లవారిపల్లెలో పూలహా రాలతో స్వాగతం పలికారు. తర్వాత పాకాల లోని కమతంలో విజయభాస్కర్‌రెడ్డి కుటుం బాన్ని ఓదార్చారు.
తోటపల్లె మీదుగా సామిరెడ్డిపల్లె చేరుకుని అక్కడ రోడ్‌షోలో పాల్గొని, వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఆయనకు పూల వర్షం కురిపించి స్వాగతించారు. తరువాత పూతలపట్టు నియోజకవర్గంలోకి ప్రవేశించి కరిణిపల్లెక్రాస్, పి.కొత్తకోట, గొల్లపల్లె, మిట్టూరు, రంగంపేట క్రాస్ ద్వారా పూతలపట్టుకు చేరుకున్నారు. పూతలపట్టులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాణిపాకం క్రాస్ ద్వారా కిచ్చన్నగారిపల్లె చేరుకున్నారు. తర్వాత దిగువపాలకూరులో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గోపాలకృష్ణాపురం మీదుగా మూర్తిగానిపల్లెకు చేరుకుని అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తర్వాత ఐరాల మండలంలోకి ప్రవేశించి, చిగరపల్లె ద్వారా తిరువణంపల్లె చేరుకుని రాత్రి అక్కడే బసచేశారు. పర్యటనలో పలువురు వృద్ధులు, వికలాంగులను జగన్మోహన్రెడ్డి పలుకరిస్తూ వచ్చారు. వేలాదిమంది అభిమానులు పంట పొలాల నుంచి రోడ్డు మీదకు చేరుకుని ఆయనకు ఆహ్వానం పలికారు. పాకాలలో జననేతను మాజీ తెలుగుదేశం నాయకుడు ఎల్బి.ప్రభాకర్ కలుసుకున్నారు. పాకాలలో ఓదార్పు ముగిసిన తర్వాత కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి క్యాలెండర్ తీసుకుని రాగా, దానిని ఆవిష్కరించారు.
వైఎస్ఆర్ సేవాదళ్ నాయకుడు చొక్కారెడ్డి జగదీశ్వరరెడ్డి, జగన్మోహన్రెడ్డికి తెలుగుతల్లి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు. యాత్ర చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పూతలపట్టు కన్వీనర్ డాక్టర్ సునీల్‌కుమార్ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు మిథున్ రెడ్డి, పార్టీ నాయకులు తలుపులపల్లి బాబు రెడ్డి, ఆశాలత, శైలజా రెడ్డి, గోవిందరెడ్డి, దామినేడు కేశవులు పాల్గొన్నారు.