Vishakha Railway Zone
-
విశాఖ రైల్వే జోన్ లాభదాయకమే!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్ కోస్ట్) రైల్వే జోన్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రైల్వే బోర్డుకు చేరింది. వాల్తేరు డివిజన్లోని ఏ ఒక్క ఉద్యోగినీ కదల్చనవసరం లేకుండా.. ఏడాదికి రూ.13 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చేలా ఓఎస్డీ ధనుంజయులు డీపీఆర్‌ను రూపొందించి రైల్వే బోర్డుకు అందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆ నివేదిక ప్రతులను ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులకు, వివిధ విభాగాలకు అందించింది. వారి నుంచి రెండు వారాల్లో అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించనుంది. వీటన్నింటినీ క్రోడీకరించి తుది నివేదిక సిద్ధం చేస్తారు. అనంతరం కేంద్ర కేబినెట్లో ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత జోన్ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభించాలని నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని వాల్తేరు రైల్వే అధికారులు చెబుతున్నారు. అంతా సక్రమంగా సాగితే.. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ జోన్ సేవలు ప్రారంభం కానున్నాయి. డీపీఆర్‌లో ముఖ్యాంశాలివీ - జోన్ కేంద్రంతో పాటు వాల్తేరు డివిజన్‌ను విభజించి, కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌ను రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. దీంతోపాటు ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వ్యయంతో అదనపు హంగులు సమకూర్చాలి - జోన్ ప్రధాన కార్యాలయానికి రూ.100 కోట్లు వెచ్చిస్తే సరిపోతుంది - జోన్ ఏర్పడితే రూ.13 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది - వాల్తేరు డివిజన్‌ను విభజించి.. రాయగడ డివిజన్ ఏర్పాటు చేసి.. మిగిలిన భాగాన్ని విజయవాడ డివిజన్లో విలీనం చేయాల్సి ఉంటుంది - వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాల్ని జోన్ తాత్కాలిక ప్రధాన కార్యాలయంగా చేయాలి. ఏడాదిలోపు పూర్తి సదుపాయాలతో జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మించవచ్చు. - రాష్ట్రాల సరిహద్దుల్ని పరిగణనలోకి తీసుకోకుండా జోన్ హద్దుల నిర్ణయం - విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్‌తో కలిపి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో 50 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు - వాల్తేరు డివిజన్లో 18 వేల మంది ఉద్యోగులుండగా.. వీరిలో 930 మంది డీఆర్ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. జోన్ వస్తే.. జోన్ కార్యాలయంలో 1,250 మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. అదనంగా ఉద్యోగులు అవసరం కాగా.. కేవలం 930 మందికి ఆప్షన్లు ఇస్తే సరిపోతుంది. క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది విశాఖ కేంద్రంగా ఉన్న జోన్లోనే పనిచేస్తారు - వాల్తేరు నుంచి కొత్త డివిజన్‌కు వెళ్తే.. ఉద్యోగులు కొత్త జోన్ పరిధిలోకే వస్తారు. వారి సీనియారిటీలో ఏ మాత్రం మార్పు లేకుండా ప్రమోషన్లు పొందేలా విధివిధానాలు - వాల్తేరు డివిజనల్ రైల్వే ఆస్పత్రిని ఆధునికీకరించి అత్యాధునిక వైద్య సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేయాలి - రాయగడ డివిజన్ ఏర్పాటు అంశాన్ని కూడా డీపీఆర్‌లో ప్రధానంగా పొందుపరిచారు - డివిజన్లోని డీజిల్, ఎలక్ట్రికల్ లోకో షెడ్లు, మెకానికల్ వర్క్ షాపులు, కోచ్ మెయింటెనెన్స్‌లను అప్‌గ్రేడ్ చేయాలి - జోన్ తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పరిధిలో 5 రైళ్లు, ఇతర ప్రాంతాలకు మరో 5 కలిపి మొత్తం 10 సర్వీసులు ప్రారంభించాలని భావిస్తున్నారు. -
వాల్తేరు ఉద్యోగుల్లో కలవరం
వాల్తేరు డివిజన్ విభజన దాదాపుగా ఖరారైపోతోంది. ఉద్యోగ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా.. రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం విభజన ప్రక్రియ ఒక్కో అడుగు వేస్తోంది. దీంతో వాల్తేరు డివిజన్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఎన్నో ఏళ్లుగా డిపార్ట్మెంట్లో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు.. ఇప్పుడు డివిజన్ రెండుగా చీలుతున్న నేపథ్యంలో తమ భవితవ్యం ఏమైపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: రైల్వే జోన్ సాధించామన్న ఆనందం కంటే.. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ కోల్పోతున్నామన్న బాధ ప్రతి ఒక్కరినీ కలవరపరుస్తోంది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను విభజించి విశాఖ జోన్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. డివిజన్ విభజించేందుకు అవసరమైన వ్యవస్థ కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. వాల్తేరు డివిజన్ విభజన చేస్తూ ఇదే సమయంలో రాయగడ డివిజన్ ఏర్పాటు, నిర్వహణకు సంబం«ధించిన విధివిధానాలు రూపొందించాలంటూ తూర్పు కోస్తా ప్రధాన కార్యాలయ జనరల్ మేనేజర్‌ను రైల్వే బోర్డు ఆదేశించింది. అదే విధంగా రాయగడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్‌కు సంబంధించిన విధివిధానాలు రూపొందించేలా ఒక నోడల్ అధికారిని నియమించారు. ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్ ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది. ఎక్కడ పనిచెయ్యాలి? దశాబ్దానికి పైగా చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్లో 18,760 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. జోన్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్‌ను రెండుగా చీల్చేస్తున్నారు. కొంత భాగాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్‌లోనూ.. మిగిలిన భాగాన్ని విజయవాడ డివిజన్ లోనూ కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వాల్తేరు పూర్తిగా కనుమరుగు కాబోతోంది. దీంతో వాల్తేరు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏ డివిజన్ కిందికి వస్తారన్న విషయంపై ఇంకా సందిగ్థత నెలకొంది. రెండింటిలో ఏ డివిజన్‌కు పంపిస్తారన్న దానిపై ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. విభజన పాపం.. పదోన్నతులకు శాపం! విభజన కారణంగా ఉద్యోగుల కొత్త డివిజన్లో పని చేయాల్సి రావడం ఒక ఎత్తయితే.. దీని కారణంగా పదోన్నతులకు దూరం కానుండటం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. ఎన్నో ఏళ్లుగా డిపార్ట్మెంట్లో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు.. కొత్త డివిజన్‌కు మారిపోతే, వారి సీనియారిటీ ఏమైపోతుందోనని సతమతమవుతున్నారు. కలాసీలు, ట్రాక్మెన్లు, టెక్నీషియన్లుగా ఉద్యోగంలో చేరిన వారు.. డివిజన్ విడిపోతే జీవిత కాలం ప్రమోషన్ల కోసం పాకులాడాల్సిందే. కలాసీలకు ప్రమోషన్ వస్తే.. రూ.100 మాత్రమే జీతం పెరిగినా.. దాని కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారు వాల్తేరు డివిజన్లో వందల మంది ఉన్నారు. అదే విధంగా మూడేళ్లకు పైగా సర్వీస్ చేసిన సుమారు 300 మంది గ్యాంగ్మెన్లు జేఈలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. టెక్నీషియన్లంతా డివిజనల్ సీనియారిటీ కోసం గ్రూప్–డి ఉద్యోగులంతా యూనిట్ సీనియారిటీని కోల్పోయే ప్రమాదముంది. క్లర్క్ పదోన్నతుల్లో అసమానతలు...! మరోవైపు ఇప్పటికే డిపార్ట్మెంట్లో క్లర్క్ ఉద్యోగుల పదోన్నతుల్లో అసమానతలు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ కారణంగా చాలా నష్టపోయిన క్లర్క్‌లు ఈ ఏడాదైనా ప్రమోషన్ వస్తుందని ఆశించారు. అయితే డివిజన్ విడగొడుతున్నారన్న నేపథ్యంలో మరింత కుంగుబాటుకు గురవుతున్నారు. ఒకేసారి విధుల్లో జాయిన్ అయినా కొంతమందికి ప్రమోషన్లు రావడం.. మరికొందరికి 15 నుంచి 20 ఏళ్లు దాటినా ఒక్క ప్రమోషన్ కూడా ఇవ్వకపోవడంపై నిరుత్సాహంగా ఉన్నారు. ఇంటర్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు కూడా అందకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. రేపు కొత్త డివిజన్‌కు వెళ్లాక ప్రమోషన్ కోసం ఇంకెన్ని దశాబ్దాలు వేచిచూడాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం.. డివిజన్ విడిపోతే.. వాల్తేరు పరిధిలో ఉన్నవారంతా ఏ చిన్న పనికోసమైనా విజయవాడ డివిజన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు డివిజన్లో ఉన్న ప్రధాన ఆదాయ వనరులు కూడా వేరే జోన్‌కి వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. పదోన్నతులు కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంపైనే ఎక్కువగా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. – ఎస్.రామచంద్రరావు, రైల్వే యూనియన్ నాయకుడు గ్రూప్–సీ,డీ సిబ్బందికి న్యాయం చేయాలి.. వాల్తేరు డివిజన్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్రమోషన్ పోస్టులన్నీ తక్షణమే భర్తీ చెయ్యాలి. దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న గ్రూప్–సీ, గ్రూప్–డీ ఉద్యోగులకు న్యాయం చెయ్యాలి. ఉన్నపళంగా డివిజన్ విడిపోతే సి బ్బంది తీవ్రంగా నష్టపోతారు. డివిజన్ విడగొ ట్టకూడదని కోరుతున్నాం. – భాస్కర్ రావు, యూనియన్ జోనల్ ప్రతినిధి సిబ్బందికి న్యాయం చెయ్యాలి డివిజన్ విడిపోదని భావిస్తున్నాం. ఒకవేళ ఏ కారణం చేతనైనా డివిజన్ విడిపోతే ఇక్కడి సిబ్బంది తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కొత్త జోన్, కొత్త డివిజన్ విధానం పూర్తయ్యేలోపు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, ఇంటర్ డిపార్ట్మెంట్ ఛేంజ్ విధానాన్ని 25, 33, 70 శాతం కోటా విధానంగా యుద్ధప్రాతిపదికన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. –డా. పెదిరెడ్ల రాజశేఖర్, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి -
వాల్తేరు డివిజన్‌ను చేజారనివ్వం
సాక్షి, విశాఖపట్నం: పురాతమైన, అధిక ఆదాయం కలిగిన వాల్తేరు రైల్వే డివిజన్‌ను చేజారనివ్వబోమని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది ప్రధాన అంశమన్నారు. జోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా వాల్తేరు డివిజన్ విషయంలోనే తేడా వస్తోందని చెప్పారు. వాల్తేరుతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో విశాఖ జోన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామన్నారు. రైల్వే జోన్ ఇచ్చి వాల్తేరు డివిజన్‌ను తీసేస్తే మనకు ఒక చేయి తీసేసినట్లే అవుతుందన్నారు. దీనికి అంగీకరించకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. వాల్తేరు డివిజన్లో ఉన్న కొత్తవలస–కిరండూల్ (కేకే) రైల్వే లైన్లో ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉన్న భాగాన్ని అవసరమైతే రాయగడ డివిజన్లో చేర్చుకోవాలన్నారు. అలా కాకుండా మొత్తం కేకే లైన్‌ను రాయగడ డివిజన్లో కలపడమంటే విశాఖ జోన్‌కు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు. జోన్‌కుపై అన్ని వివరాలతో నివేదిక తయారు చేశామని, సోమవారం రైల్వే మంత్రిని కలుస్తామన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు ఏ ప్రతిపాదనలు ఉన్నా, సమస్యలు ఉన్నా ప్రజలు ఎంపీల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. భూ ఆక్రమణలపై మరో సిట్ విశాఖలో భూ ఆక్రమణలపై విచారణకు గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినప్పటికీ ఆ నివేదిక బయట పెట్టలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలతో కొత్తగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారని వెల్లడించారు. ముస్లింల ప్రయోజనాలను మర్చిపోం వైఎస్సార్సీపీ ముస్లింల ప్రయోజనాలను ఎప్పుడూ మరిచిపోదని విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం ఆయనను సన్మానించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ తరఫున ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ముస్లింలకు కేటాయిస్తున్నామన్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడేందుకు త్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించాలని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించామని తెలిపారు. మంత్రులు మోపిదేవి, అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫరూఖీ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
టీడీపీ ఎంపీలపై పవన్ మండిపాటు
సాక్షి, విశాఖపట్నం : దేశంలో యువత ఉంది కానీ ఉద్యోగాలు మాత్రం లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చిట్టివలసలో జూట్ మిల్లులో 600 మంది కార్మికులు రోడ్డుమీద పడితే వారిని ఆదుకోవడానికే గంటా శ్రీనివాసరావును స్థానికులు గెలిపించారని చెప్పారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా శుక్రవారం తగరపు వలసలో పవన్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, మురళీమోహన్లకు ప్రత్యేక హోదా అన్నా, రైల్వేజోన్ అన్నా హేళన అయిందంటూ పవన్ మండిపడ్డారు. రైల్వే జోన్ విషయంలో నా వైఖరి ఏంటని అడుగుతున్నారు. అయితే ముందు మీ వైఖరి ఏంటో చెప్పండి ముందు 19 మంది ఎంపీలు రాజీనాయాలు చేయాలి. అప్పుడు మీతో కలిసి నేను వస్తాను. అంతా కలిసి రైల్ రొఖో చేద్దాం. కాంగ్రెస్ నేతలను తరిమేయాలని చెప్పింది నేనే. కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం వైఖరి ఏంటో స్పష్టం చేయాలి. దళితుల భూములు అన్యాయంగా లాక్కుంటున్నారు. ఏపీలో ఎక్కడ చూసినా భూ దోపిడీలే జరుగుతున్నాయి. ప్రచారానికి నేతలు వచ్చినప్పుడు సీఎం అని అరవడం ఆపేయండి.. ముందు ఓటింగ్ హక్కును పొందండి. అప్పుడు మీరు ఓట్లేసిన వాళ్లు సీఎం అవుతారని’ పవన్ పేర్కొన్నారు. -
హోదాలాగే రైల్వే జోన్ ఎగ్గొట్టేందుకు కుట్ర
ఆత్మగౌరవ యాత్ర సభలో మాజీ మంత్రులు బొత్స, ధర్మాన సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక హోదా మాదిరిగానే విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు హామీని కూడా గాలికొదిలేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ సాధన కోసం వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి భీమిలి వరకు తలపెట్టిన ఆత్మగౌరవ పాదయాత్ర గురువారం అనకాపల్లి నెహ్రూచౌక్ వద్ద శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నాలుగురోడ్ల జంక్షన్లో జరిగిన భారీ బహిరంగసభలో మాజీ మంత్రి బొత్స మాట్లాడారు. ఏప్రిల్ 9న తగరపువలస వద్ద జరిగే ముగింపుసభలో పార్టీ అధినేత వైఎస్ జగన్ పాల్గొంటారని బొత్స తెలిపారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కోసం మన తరపున ఒత్తిడి చేయాల్సిన సీఎంఆ ఊసెత్తక పోవడం వల్లే ఈ ఉద్యమం చేయాల్సి వస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అవసరమైతే తన తలను రైలుపట్టాల కింద పెట్టయినా రైల్వే జోన్ సాధిస్తానని అమర్నాథ్ అన్నారు.