G7 Summit 2024: జీ7 ప్యాకేజీ ఎప్పుడు? ఎలా?
28 నెలలుగా కొనసాగుతున్న రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ చాలావరకు ధ్వంసమైంది. యుద్ధం ఆగేదెన్నడో, ఉక్రెయిన్ పునరి్నర్మాణం మొదలయ్యేదెప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జీ7 దేశాల కూటమి 50 బిలియన్ డాలర్ల (రూ.4.17 లక్షల కోట్లు) రుణ ప్యాకేజీని ప్రకటించడం ఉక్రెయిన్‌కు ఎంతగానో ఊరట కలిగించే పరిణామం అనే చెప్పాలి. వివిధ దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయం నుంచే ఈ ప్యాకేజీని ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్లు జీ7 దేశాలు వెల్లడించాయి. దీనిపై ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ విజేతగా నిలవడానికి ఈ సాయం ఒక గొప్ప ముందడుగు అని అభివరి్ణంచారు. ఈ నేపథ్యంలో జీ7 ప్రకటించిన రుణ ప్యాకేజీ, ఉక్రెయిన్‌కు కలిగే లబ్ధి, ఇందులో ఇమిడి ఉన్న ఇబ్బందులు, వివిధ దేశాలు స్తంభింపజేసిన రష్యా ఆస్తుల గురించి తెలుసుకుందాం. 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై హఠాత్తుగా దాడికి దిగింది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సైతం ఎదురుదాడి ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. వేలాది మంది సామాన్య ప్రజలు, సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలంటూ పశి్చమ దేశాలు హెచ్చరించినా రష్యా లెక్కచేయడం లేదు. దీంతో రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి తమ దేశంలో ఉన్న రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను పశి్చమ దేశాలు స్తంభింపజేశాయి. ఈ ఆస్తుల విలువ 300 బిలియన్ డాలర్ల (రూ.25.06 లక్షల కోట్లు) వరకు ఉంటుంది. వీటిపై ప్రతి సంవత్సరం 3 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్లు) వడ్డీ, ఆదాయం లభిస్తోంది. రష్యా ఆస్తులు చాలావరకు ఐరోపా దేశాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నందుకు రష్యా పరిహారం చెల్లించాల్సిందేనని అమెరికా సహా పశి్చమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు రష్యా ఒప్పుకోవడం లేదు. దాంతో రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీని, ఆదాయాన్ని పరిహారం కింద ఉక్రెయిన్‌కు ఇవ్వాలని తాజాగా జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇబ్బందులు ఏమిటి? విదేశాల్లో ఉన్న ఆస్తులు ఒకవేళ మళ్లీ రష్యా నియంత్రణలోకి వస్తే రుణాన్ని తిరిగి చెల్లించడం కష్టమే. స్తంభింపజేసిన రష్యా ఆస్తులను శాంతి చర్చల్లో భాగంగా విడుదల చేయాల్సి వస్తే రుణాన్ని చెల్లించడానికి జీ7 దేశాలు మరో మార్గం వెతుక్కోవాలి. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రష్యా ఆస్తులపై కొన్నిసార్లు అనుకున్నంత వడ్డీ గానీ, ఆదాయం గానీ రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులెదురవుతాయి. అలాగే రుణ భారాన్ని జీ7 దేశాలన్నీ పంచుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో వారం రోజుల్లో తుది ప్రణాళికను ఖరారు చేయనున్నారు. యూరప్‌లోని రష్యా ఆస్తులపై ఆంక్షలను కొనసాగించడానికి ప్రతిఏటా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ఓటింగ్ జరుగుతోంది. ఈయూలోని ఏ ఒక్క సభ్యదేశం వీటో చేసినా ఆంక్షలు రద్దవుతాయి. ఆస్తులు రష్యా అ«దీనంలోకి వెళ్లిపోతాయి. ఈయూలోని హంగేరీ దేశం ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ హంగేరీ వీటో చేస్తే ఉక్రెయిన్ రుణ ప్యాకేజీ ప్రణాళికలు మొత్తం తలకిందులవుతాయి. తమ ఆస్తులపై వచ్చే వడ్డీని, ఆదాయాన్ని పశి్చమ దేశాలు మింగేస్తామంటే రష్యా చూస్తూ కూర్చోదు కదా! కచ్చితంగా ప్రతీకార చర్యలకు దిగుతుంది. రష్యాలోనూ పశి్చమ దేశాల ఆస్తులున్నాయి. వాటిని రష్యా ప్రభుత్వం గతంలోనే స్తంభింపజేసింది. తమ ఆస్తులపై వడ్డీని కాజేసినందుకు ప్రతిచర్యగా పశ్చిమదేశాల ఆస్తులపై వడ్డీని సైతం రష్యా లాక్కొనే అవకాశం లేకపోలేదు. హక్కులు బదిలీ చేయడం సాధ్యమేనా? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నష్టపరిహారంగా ఉక్రెయిన్‌కు ఇవ్వాలనుకోవడం బాగానే ఉన్నప్పటికీ ఇందులో చట్టపరమైన అవరోధాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రష్యా అంగీకారం లేకుండా ఇలా చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటున్నారు. మొండిగా ముందుకెళ్తే తీవ్ర వివాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తొలుత న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఒక దేశానికి సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసిప్పటికీ వాటిపై హక్కులను ఇతర దేశాలకు బదిలీ చేయడం సాధ్యం కాదు. అవి ఎప్పటికైనా సొంత దేశానికే చెందుతాయి. భౌగోళికంగా తమ దేశంలో ఉన్న ఇతర దేశాల ఆస్తులను ఆయా దేశాల అనుమతి లేకుండా స్వా«దీనం చేసుకొని అనుభవిస్తామంటే కుదరదు. రష్యా ఆస్తులను ఎలా వాడుకోవచ్చు? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు ఇచ్చేసే అవకాశం లేదు. జీ7లోని ఏ దేశమైనా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకొని ఆ సొమ్మును ఉక్రెయిన్‌కు ఇవ్వొచ్చు. రుణాన్ని తీర్చేయడానికి రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీ, ఆదాయాన్ని చెల్లించవచ్చు. తమకు అందే సొమ్మును ఆయుధాలు కొనుగోలు చేయడానికి, దేశ పునరి్నర్మాణానికి ఉక్రెయిన్ ఉపయోగించుకొనేందుకు ఆస్కారం ఉంది. జీ7 నుంచి రుణ ప్యాకేజీ ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు చేరే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి రాబోయే పదేళ్లలో 486 బిలియన్ డాలర్లు (రూ.40.58 లక్షల కోట్లు) అవసరం. ఇది ముమ్మాటికీ దొంగతనమే: పుతిన్ రష్యా ఆస్తులపై వచ్చే ఆదాయంతో ఉక్రెయిన్‌కు ప్యాకేజీ ఇవ్వాలన్న జీ7 దేశాల నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ దొంగతనమేనని చెప్పారు. చోరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తమ ఆస్తుల జోలికి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. పుతిన్ శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీ7 దేశాల నిర్ణయంపై చర్చించారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా దొంగతనం కచ్చితంగా దొంగతనమే అవుతుందన్నారు. జీ7 దేశాల నిర్ణయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా శుక్రవారం ఖండించారు. ఈ నిర్ణయం చట్టపరంగా చెల్లదని తేలి్చచెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్