అర్హులందరికీ ఓటు హక్కు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:
ఓటరు జాబితాలో నమోదు, సవరణ, తొలగింపు కోసం ఈ నెల 10వ తేదీ నాటికి వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించి, అర్హులైనవారికి ఓటు హక్కు కల్పిస్తామని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చెప్పారు. ఎలక్టోరల్ జాబితా ప్రగతిపై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి భన్వర్‌లాల్ శనివారం విశాఖపట్నం కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదీ వరకు ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కార ప్రగతిని వివరించారు. జిల్లాలో ఫారం 6,7,8, 8(ఎ) కింద మొత్తం 1,71,967 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిలో ఇప్పటివరకు 90 శాతం దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించినట్టు చెప్పారు.
ఇప్పటికే 50 శాతానికి పైగా దరఖాస్తులను పరిష్కరించామన్నారు. మిగతా దరఖాస్తుల పరిశీలన, ప్రగతిని వేగవంతం చేశామన్నారు. ఈ నెల 16వ తేదీలోగా తుది జాబితా ప్రచురణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జిల్లాలో గుర్తించిన 15,700 డీ-డూప్లికేషన్ కార్డులను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రైనీ కలెక్టర్ మల్లికార్జున్, డీఆర్ఓ శివ శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ బి.శ్రీనివాస్, ఎన్నికల తహశీల్దారులు పాల్గొన్నారు.