ప్రయాణాల్లో ప్రధానం.. ఆరోగ్యం!
కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నత హోదాలు, బరువైన వేతన ప్యాకేజీ అందుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కెరీర్లో ఎదగడానికి ఎన్నో సవాళ్లను, ఒత్తిళ్లను అధిగమించి పనిచేయాలి. విధుల్లో భాగంగా తరచుగా దూర ప్రాంతాలకు, ఒక్కోసారి ఇతర దేశాలకు కూడా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ట్రావెలింగ్‌లో బడలిక ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు త్వరగా అలసిపోతుంటారు. ప్రయాణాలు అధికంగా చేసేవారిలో మానసిక సమస్యలు తలెత్తుతుంటాయి. అనారోగ్యం పాలవుతుంటారు. కార్పొరేట్ ఉద్యోగులు స్ట్రెస్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి.
తాజా ఆహారం: ఇతర నగరాలకు వెళ్లేవారు హోటళ్లలో బస చేస్తుంటారు. అక్కడ రకరకాల ఆహార పదార్థాలు కళ్లముందు కనిపిస్తుంటాయి. నోరూరించే వంటకాలు మనసును సులువుగా ఆకర్షిస్తాయి. వాటిని చూస్తూ నోరు కట్టేసుకోవడం కష్టమే. ఇలాంటి సందర్భాల్లోనే సంయమనం పాటించాలి. మీరేం తింటున్నారో ఎప్పటికప్పుడు గమనించండి. మసాలాలు, రంగులతో కూడిన తిండికి దూరంగా ఉండండి. మసాలా ఫుడ్‌తో ఆరోగ్యం పాడవుతుంది. ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి తాజా ఆహారం, పండ్లు ఎక్కువగా తీసుకోండి.
అమితంగా మంచినీరు : మంచినీరు తగినంత తీసుకోకపోతే శరీరంలో శక్తి హరించుకుపోతుంది. ఎండలో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తాగునీటి విషయంలో నియంత్రణ పనికిరాదు. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగండి. ఆ నీరు శుద్ధమైనదై ఉండాలి. అదేసమయంలో ఆలోచనా శక్తిని, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆల్కహాల్‌ను పూర్తిగా తిరస్కరించండి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడమే అన్నివిధాలా మంచిది.
నిత్యం వ్యాయామం : ఆధునిక యుగంలో ఉద్యోగులు తమ ఫిట్నెస్ను కాపాడుకోవడం నిజంగా ఒక సవాలే. ట్రావెలింగ్‌లో వ్యాయామం మర్చిపోవద్దు. హోటల్ జిమ్‌ను ఉపయోగించుకోవాలి. రకరకాల వ్యాయామాలు చేయాలి. జిమ్ సౌకర్యం అందుబాటులో లేకపోతే రోజూ కనీసం అరగంట సేపు బయట వాకింగ్ చేయాలి. ఫిట్నెస్ ఉన్న ఉద్యోగులే మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది.
కొత్త టైమ్‌జోన్ : విదేశాలకు వెళ్లి వచ్చే ఉద్యోగులు కొత్త టైమ్‌జోన్‌కు త్వరగా అలవాటుపడడం తప్పనిసరి. మీరు వెళ్లిన ప్రాంతంలోని టైమ్‌జోన్‌కు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు శీఘ్రంగా మార్చుకోవాలి. క్రమశిక్షణతో ప్రయత్నిస్తే ఇది సులువేనని నిపుణులు చెబుతున్నారు. స్థానిక టైమ్‌జోన్‌కు అలవాటుపడలేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొత్త ప్రాంతంలో కంటినిండా నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి. తగినంత నిద్ర లేకపోతే అలసట, చికాకు అధికమవుతాయి. ఇవి మీ పనితీరును దెబ్బతీస్తాయి.