మా నాన్న.. చాలా ధైర్యవంతుడు
యుద్ధసేవా మెడల్ అందుకున్న ఒక్క రోజుకే ఉగ్రవాదులతో పోరాటంలో అసువులు బాసిన కల్నల్ మునీంద్రనాథ్ రాయ్‌కి ఆయన కుమార్తె సహా పలువురు కన్నీటి వీడ్కోలు పలికారు. 11 ఏళ్ల వయసున్న అల్కా రాయ్ తన తండ్రికి సెల్యూట్ చేసే సమయంలో ఆమె తన తండ్రి రెజిమెంట్‌లో అలవాటుగా అరిచినట్లుగా అరిచింది. తర్వాత తన కుడిచేతిని ఒక్కసారిగా గాల్లోకి లేపి, చిట్టచివరిసారిగా ఆయనకు సెల్యూట్ చేసింది. అయితే.. ఆ సమయంలో మాత్రం తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది.
ఆమె కళ్లవెంట నీళ్లు ప్రవాహంలా కారిపోయాయి. అలా ఏడుస్తూనే ఆమె తన తండ్రికి కడసారి వీడ్కోలు పలికింది. ఆ క్షణంలో అక్కడున్న సైనికాధికారుల గుండెలు ఆవేదనతో బరువెక్కాయి. మరోవైపు కల్నల్ రాయ్ భార్య రోదనను కూడా ఎవరూ ఆపలేకపోయారు. అయితే ఆమె ఆరేళ్ల కొడుక్కి మాత్రం ఏం జరిగిందో పూర్తిగా అర్థం కాకపోవడంతో అతడికి అక్కడున్న పరిస్థితి సరిగ్గా తెలియలేదు. తన తండ్రి చాలా ధైర్యవంతుడని అల్కా రాయ్ తెలిపింది.
2/9 గూర్ఖా రైఫిల్స్ దళానికి చెందిన 39 ఏళ్ల కల్నల్ రాయ్ మంగళవారం నాడు ఉగ్రవాదుల దాడిలో మరణించారు. అందుకు సరిగ్గా ఒక్క రోజు ముందే ఆయనకు యుద్ధసేవా మెడల్ లభించింది. కాశ్మీర్ లోయలో ఆయన 42 రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌ను కమాండ్ చేసేవారు. రాయ్ చితికి ఆయన అన్నయ్య కల్నల్ డీఎన్ రాయ్ నిప్పంటించారు. ఆయన కూడా గూర్ఖా రైఫిల్స్‌లో అధికారిగా పనిచేస్తున్నారు. మరో సోదరుడు వైఎన్ రాయ్ సీఆర్పీఎఫ్లో ఉన్నారు. అలా ముగ్గురూ దేశమాత సేవలోనే తరించడం గమనార్హం.