దేశ సమగ్రాభివృద్ధి మోడీతోనే సాధ్యం
కారటగి, న్యూస్‌లైన్ : దేశానికి సరైన నాయకులు లేక పాకిస్థాన్ ఉగ్రవాదులు పేట్రేగి పోతున్నారని, చైనా ఆక్రమణలు, అమెరికా అనవసర జోక్యంతో భారత్ నలిగిపోతోందని, ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి, దేశ సమగ్రాభివృద్ధికి నరేంద్ర మోడీనే తగిన వ్యక్తి అని మాజీ ముఖ్యమంత్రి యూడ్యరప్ప పేర్కొన్నారు.
కొప్పళ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కారటగి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదుట బుధవారం ఏర్పాటు చేసిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభనుద్దేశించి ఆయన మాట్లాడారు. 50 ఏళ్లుగా దేశంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లేనట్లేనన్నారు. గత బీజేపీ ప్రభుత్వం రోడ్లు, వ్యవసాయ, నీటిపారుదల రంగాలను ప్రగతి పథంలో నడిపించిందన్నారు. గ్రామీణాభివృద్ధితో పాటు రైతులు, మహిళల స్వావలంబనకు పాటు పడిందన్నారు. అలాంటి పథకాల అమలు కాంగ్రెస్‌తో సాధ్యం కాదన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ కొరత నివారించేందుకు గతంలో తమ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయగా బొగ్గు గనులు కేటాయించని మన్మోహన్ ప్రభుత్వం చివరకు బొగ్గు గనుల కేటాయింపుల్లో సుప్రీంకోర్టుతో చీవాట్లు తినిందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసమే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, మంత్రిపదవుల కోసం కాదన్నారు.
ఆ తర్వాత కొప్పళ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కరడి సంగణ్ణ మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీ విద్యా, ఆరోగ్య స్థాయి సమితి అధ్యక్షుడు అమరేష్ కుళగి, మాజీ అధ్యక్షురాలు జ్యోతి బిల్గార్, టీపీ సభ్యులు హిరేబసప్ప సజ్జన్, తిప్పణ్ణ, మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప, మాజీ ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి, మాజీ కాడా అధ్యక్షుడు హెచ్.గిరేగౌడ, రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్ఛా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ సోమలింగప్ప తదితరులు పాల్గొన్నారు.