రాళ్ల దాడి నుంచి రక్షించుకునేందుకు స్టోన్ గార్డును అడ్డుపెట్టుకున్న ఎస్పీ అమిత్‌బర్దర్
రెచ్చిపోయిన పచ్చమూక స్వైరవిహారం
పెద్దారెడ్డి వాహనంతో పాటు పలు వాహనాల ధ్వంసం
ఎస్పీ ఎదుటే బరి తెగించిన జేసీ వర్గీయులు
తాడిపత్రి/ తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా సోమవారం టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి లక్ష్యంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పెద్దారెడ్డితో పాటు పలువురి వాహనాలు ధ్వంసమయ్యాయి. తాడిపత్రిలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి అల్లర్లు, ఘర్షణలకు పాల్పడి పోలింగ్ సరళిని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు కుట్ర పన్నారు. పట్టణంలో స్వైర విహారం చేస్తూ ఎక్కడికక్కడ దాడులకు దిగారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి స్థానిక గాంధీకట్ట వద్దనున్న బూత్‌లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న పచ్చ మూకలు కవ్వింపు చర్యలకు దిగాయి.
అదే సమయంలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ వారిని విడిచి పెట్టి వైఎస్సార్‌సీపీ వర్గీయులపై పోలీసులు ప్రతాపం చూపించడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి జోక్యం చేసుకున్నారు. శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు సహకరిస్తున్న తమపై పోలీసుల ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరిస్తూ జేసీ సోదరులకు తొత్తుగా మారారని, ఇలా వ్యవహరించడం తగదని కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు చెప్పారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారికి సర్దిచెప్పి పంపించేశారు.
అక్కడి నుంచి పెద్దారెడ్డి ఓంశాంతి నగర్‌లోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తిరిగొస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ దశలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందస్తు ప్రణాళికతో జేసీ అనుచరులు రాళ్లు సిద్ధం చేసుకుని ఒక్కసారిగా పెద్దారెడ్డితో పాటు అనుచరులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో పెద్దారెడ్డి వాహనంతో పాటు మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ హుటాహుటిన తాడిపత్రికి చేరుకున్నారు. జేసీ అనుచరులు ఎస్పీ సమక్షంలోనే రాళ్ల దాడి కొనసాగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాల వారిని చెదరగొట్టాయి. డీఐజీ ఇమాన్షు బాబ్జి తాడిపత్రికి చేరుకుని శాంతిభద్రతలను సమీక్షించి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment