గుబిడిపల్లి గ్రామం
ఆదిలాబాద్: భీంపూర్ మండలంలోని గుబిడిపల్లిని కిడ్నీ సంబంధిత వ్యాధి వేధిస్తోంది. రెండేళ్ల వ్యవధిలోనే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందగా పలువురు వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు, 300కు పైగా జనాభా నివాసం ఉంటున్నారు. గ్రామస్తులంతా వ్యవసాయంతో పాటు కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాము తాగుతున్న నీటివల్లనా? లేక ఆహారపు అలవాట్లా? ఇతర కారణాల చేత కిడ్నీ వ్యాధులు సోకుతున్నాయో తెలియక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులంతా గ్రామ సమీపంలోని బోరుబావి నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. ఇప్పటికే అధికారులు నీటికి క్లోరైడ్ పరీక్షలు నిర్వహించగా సాధారణంగా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది గ్రామానికి సమీపంలో ఉన్న కప్పర్ల, జామిడి నుంచి మినరల్ వాటర్‌ను సైతం ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తున్నారు.
రెండేళ్ల వ్యవధిలో ఆరుగురు మృతి
రెండేళ్ల వ్యవధిలోనే గ్రామానికి చెందిన ఆరుగురు కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామానికి చెందిన తొడస ం దాదారావు, గంగమ్మ, రామన్న, డి.ఇస్తారి, దేవ మ్మ, లలితకు కిడ్నీ సంబంధిత వ్యాధి సోకి మృతి చెందగా పలువురు వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలోని ఆశమ్మ, భూమన్న నిత్యం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. గ్రామానికి సరైన రోడ్డు, వాహన సౌకర్యం లేకపోవడంతో ప్రత్యేకంగా ఆటో కు రూ.500 చెల్లించి ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వైద్యశాఖ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వైద్యశాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించి వ్యాధికి గల కారణాలు తెలియజేస్తే వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో తన పిల్లలతో కనిపిస్తున్న మహిళ పేరు పెంటపర్తి సంగీత. వీరిది భీంపూర్ మండలంలోని గుబిడిపల్లి. ఈమె భర్త సంతోష్ పదేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఎలాంటి పనులు చేయలేకపోవడంతో అన్నీతానై కుటుంబానికి అండగా నిలిచింది. ఈక్రమంలో డయాలసిస్ సైతం అవసరం ఉండటంతో రెండు రోజులకోసారి ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో సంతోష్ పదిహేను రోజుల క్రితం మృతి చెందాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో పిల్లలను ఎలా పెంచేదని సంగీత ఆవేదన వ్యక్తం చేస్తోంది.
గ్రామాన్ని సందర్శిస్తాం
గుబిడిపల్లిలో కిడ్నీ సంబంధిత వ్యాధి అధికంగా వస్తుందని ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. కిడ్నీ వ్యాధి సోకడానికి గల కారణాలు తెలుసుకునేందుకు గ్రామాన్ని సందర్శించి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తాం. గ్రామస్తుల ఆహారపు అలవాట్లతో పాటు తాగే నీటిని పరీక్ష చేస్తే కిడ్నీ వ్యాధికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. – నిఖిల్ రాజ్, వైద్యాధికారి, భీంపూర్
Comments
Please login to add a commentAdd a comment