● నిర్వాహకులు, అధికారులకు కల్పతరువులా ‘ఔట్‌సోర్సింగ్’
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల వివరాలు..
ఎంప్యానల్‌మెంట్ గుర్తించిన సంవత్సరం : 2019–20
ఎంప్యానల్‌మెంట్‌లో ఉన్న ఏజెన్సీలు : 17
యాక్టీవ్‌గా ఉన్న ఏజెన్సీలు : 09
వివిధ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ పోస్టులు :
(సుమారు) 1250
సాక్షి,ఆదిలాబాద్: ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు.. ఇటు నిర్వాహకులకు, అటు అధికారులకు ఎనీ టైమ్ మనీలా మారిపోయాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వాటిని ఆ శాఖలు వదులుకోవడం లేదు. ఐదేళ్లుగా వాటికే వర్క్ ఆర్డర్లు ఇస్తూ రెన్యూవల్ చేస్తున్నారు. కొత్త పోస్టులు మంజూరైనా వాటికే పంచేస్తున్నారు. సాధారణంగా ఏటా లేనిపక్షంలో రెండేళ్లకోసారి ఏజెన్సీల మార్పు చేపట్టాలి. ఇందుకోసం కొత్త ఎంప్యానల్‌మెంట్ రూపొందించాలి. అయితే ఈ ప్రక్రియకు ఐదేళ్లుగా బ్రేక్ పడడం గమనార్హం.
ఐదేళ్ల క్రితం ఏర్పాటైనవే..
ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ సర్వీసులను ఏజెన్సీలు చేపడతాయి. ఆ ఏజెన్సీలకు వీటి నియామక ప్రక్రియ అప్పగించేందుకు ముందుగా అవి ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందాలి. దాన్నే ఎంప్యానల్‌మెంట్ అంటారు. 2019–20 సంవత్సరంలో దీనికి సంబంధించి టెండర్లు నిర్వహించి ఏజెన్సీలను గుర్తించారు. ఆ తర్వాత ఏటా వాటి గడువు పొడగిస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఐదేళ్లవుతుంది. ఔట్‌సోర్సింగ్ కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్‌కు ఈ టెండర్ల నిర్వహణకు సంబంధించి విచక్షణ అధికారాలు ఉంటాయి. జిల్లాలో ఎంప్యానల్‌మెంట్ నుంచి మొదలుకొని వర్క్ ఆర్డర్.. ఇలా ప్రతీ అంశంలో గతంలో అక్రమాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఎంప్యానల్‌మెంట్ రద్దు చేసి కొత్తగా టెండర్లు చేపట్టి దీన్ని గాడిలో పెట్టేందుకు ఏవైన చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సిందే.
అడ్డూ అదుపులేని ఏజెన్సీల అక్రమాలు..
గతంలో బీసీ సంక్షేమ శాఖలో అక్షర ఏజెన్సీకి సంబంధించి అక్రమం వెలుగు చూసింది. ఇందులో కింది స్థాయి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులైన కుక్, వాచ్‌మెన్, తదితర ఉద్యోగులకు సంబంధించి ఈ ఏజెన్సీ నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా, అటు వారికి సంబంధించి పీఎఫ్ కట్టకుండా ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల బిల్లులను డ్రా చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని అప్పట్లో శ్రీసాక్షిశ్రీ వెలుగులోకి తెచ్చింది. అయితే విస్తుపోవాల్సిన అంశం ఏమిటంటే.. ఆ అక్షర ఏజెన్సీ అసలు ఎంప్యానల్‌మెంట్ జాబితాలోనే లేదు. ఇకపోతే ఇటీవల రిమ్స్‌లోనూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల విషయంలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పాత ఏజెన్సీల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
అప్పట్లో ఎంప్యానల్‌మెంట్‌లో 17 ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను గుర్తించారు. వాటికి మాత్రమే వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. మధ్యలో వీటి సంఖ్య 20కి పెరిగినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. కొత్త ఎంప్యానల్‌మెంట్ ఏర్పాటయ్యే వరకు పాత వాటిలో ముందుగా గుర్తించిన ఏజెన్సీలను మినహాయిస్తే మిగతా వాటిని చేర్చేందుకు ఆస్కారం ఉండదు. అయితే జిల్లాలో గతంలో ఉపాధికల్పన శాఖ అధికారులుగా చేసిన వారు పలు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. ఇలా అదనంగా ఏజెన్సీలు ఎలా పుట్టుకొచ్చాయన్నది జిల్లా ఔట్‌సోర్సింగ్ కమిటీకి తెలిసే జరిగిందా.. తెలియక జరిగిందా.. అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఏసీబీ దాడుల్లో ఉపాధికల్పన శాఖ అధికారులు పట్టుబడ్డారు. ఓ ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇచ్చే విషయంలో రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అప్పటినుంచే జిల్లాలో ఉన్న ఎంప్యానల్‌మెంట్, వివిధ ప్రభుత్వ శాఖల్లో అస్తవ్యస్తంగా ఉన్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నిర్వహణ తీరును కమిటీ గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏళ్లుగా ఉన్న ఈ ఎంప్యానల్‌మెంట్‌ను రద్దు చేసి కొత్తది ఏర్పాటు చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల కల్పనలో అర్హులైన నిరుద్యోగులకు ఆసరగా నిలవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
కొత్త ఎంప్యానల్‌మెంట్ ఏర్పాటుకు చర్యలు..
కొత్త ఎంప్యానల్‌మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. విధివిధానాలు రూపొందిస్తున్నాం. పాత దాని గడువు ఈ మార్చి 31తో ముగిసిపోతుంది. సాధారణంగా ఎంప్యానల్‌మెంట్ గడువు కొన్ని జిల్లాల్లో ఏడాది, మరికొన్ని జిల్లాలో రెండేళ్ల పాటు ఉంటుంది. జిల్లాలో కొన్నేళ్లుగా పాత ఎంప్యానల్‌మెంటే కొనసాగుతుంది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రక్రియ చేపడతాం.
–మిల్కా, ఉపాధికల్పనశాఖ ఇన్‌చార్జి అధికారి
● నిర్వాహకులు, అధికారులకు కల్పతరువులా ‘ఔట్‌సోర్సింగ్’
● నిర్వాహకులు, అధికారులకు కల్పతరువులా ‘ఔట్‌సోర్సింగ్’
Comments
Please login to add a commentAdd a comment