● పూర్తికాని కొరాట–చనాకా పనులు ● సర్కారు మారగా నిలిచిన
కొరాట–చనాకా బ్యారేజ్ (ఫైల్)
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో దిగువ పెన్‌గంగానదిపై నిర్మిస్తున్న చనాకా–కొరాట బ్యారేజీ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు దృష్టి సారిస్తేనే పూర్తయ్యే పరిస్థితి ఉంది. నిర్మాణ పనులు తుది దశలో ఉన్న సమయంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ ఇది పూర్తయితే జిల్లాలో అత్యధిక ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది. కాగా, త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో నిధుల కేటాయింపులో పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నా..
కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో వివక్ష చూపుతోందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. గత జూలైలో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని ప్రకటించింది. దీంట్లో కొరాట–చనాకా బ్యారేజ్ కూడా ఉండగా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్ట్ స్వరూపం ఇలా..
లోయర్ పెన్‌గంగపై తెలంగాణ–మహారాష్ట్ర నది భూభాగాన్ని కలుపుతూ కొరాట–చనాకా బ్యారేజ్ నిర్మాణానికి రూ.1,227 కోట్ల అంచనా వ్యయంతో 2015–16లో పరిపాలన అనుమతి ఇచ్చారు. ఆది లాబాద్ నియోజకవర్గంలోని రెండు మండలాలు, బోథ్ నియోజకవర్గంలో ఒక మండలం కలుపుకొని మొత్తంగా 51 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం దీని అంచనా వ్యయం సుమారు రూ.2వేల కోట్లకు చేరింది.
ఇవీ.. పెండింగ్ పనులు
చనాకా–కొరాట బ్యారేజీ నిర్మాణంలో భాగంగా బ్యారేజ్, దానికి కొద్ది దూరంలో పంప్‌హౌస్, కాలు వల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ, పిప్పల్‌కోటి రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలి. ఇందులో బ్యారే జ్, పంపుహౌస్, ఎల్‌పీపీ కెనాల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ, దాని కింద మైనర్స్, సబ్ మైనర్స్ నిర్మించాలి. వీటికి సంబంధించి పనులే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటికీ సంబంధించి భూసేకరణ, నిర్మాణ వ్యయం అంచనా వేసిన అధికారులు గతంలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన పక్షంలో మిగతా పనులు పూర్తి కానున్నాయి. కాగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పంప్‌హౌస్ వద్ద ఇది వరకే డ్రైరన్, వెట్‌రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎల్‌పీపీ కెనాల్‌లోకి నీళ్లు ఎత్తిపోయడాన్ని పరిశీలించారు. అయితే ఎల్‌పీపీ ప్రధాన కెనాల్ పనులు పూర్తయినా డిస్ట్రిబ్యూటరీ, మైనర్స్, సబ్ మైనర్స్ పనులు పెండింగ్‌లో ఉండటంతో నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తి చేస్తే ఎల్‌పీపీ కెనాల్ ద్వారా 37,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
కొరాట–చనాకా బ్యారేజ్ వివరాలు
అంచనా వ్యయం : రూ.1,227 కోట్లు
ప్రస్తుత అంచనా.. : రూ.2 వేల కోట్లు
ఆయకట్టు లక్ష్యం: 51 వేల ఎకరాలు
నిధులు కేటాయిస్తేనే..
డిస్ట్రిబ్యూటరీ సిస్టంను డీ–14 నుంచి డీ–19 వర కు నిర్మించాలి. దీనికి సంబంధించి ఇంకా 800 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికి సుమారు రూ.100 కోట్ల వరకు అవసరమని పేర్కొంటున్నారు. డిస్ట్రిబ్యూటరీ సిస్టం నిర్మాణానికి రూ.150 కోట్లు అవసరమని తెలిపారు. మొత్తంగా ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేస్తే డిస్ట్రిబ్యూటరీ పనులు పూ ర్తయితే ఎల్‌పీపీ కెనాల్ ద్వారా ఆయకట్టుకు సాగు నీరు అందించే వీలుంటుంది. ఇక పిప్పల్‌కోటి రి జర్వాయర్ నిర్మాణం కోసం మరో వెయ్యి ఎకరా లు సేకరించాల్సి ఉంది. దాని నుంచి కొరాట–చనాకా కెనాల్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా మరో 13,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
Comments
Please login to add a commentAdd a comment