రావికమతం: కనీస మౌలిక వసతులు కల్పించాలంటూ మండలంలో చీమలపాడు పంచాయతీ సామాలమ్మ కొండపై జీలుగులోవ గ్రామంలో పీవీటీజీ తెగకు చెందిన 8 గిరిజన కుటుంబాలు ఆదివారం ఆందోళనకు దిగాయి. కనీస సౌకర్యాలు లేవని గతంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు గిరిజన గ్రామాన్ని సందర్శించి కొండ కిందకు వస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి గిరిజనులు అంగీకరించారు. వీరికి చీమలపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 169లో 30 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అయితే ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో చాలా ఇబ్బందులకు గురై గతంలో సీదరి వెంకట్రావు(50), కొర్రా బాబూరావు(45)మృతి చెందారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించానలి డిమాండ్ చేస్తూ ఆదివారం గిరిజనులు రోడ్డెక్కారు. మంగళవారం రావికమతం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందరావు, కొర్రా బాలరాజు, సీదరి బాలరాజు తెలిపారు.