● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
సాక్షి,పాడేరు: జిల్లా లోని పాడేరు, రంపచోడవరం, చింతూ రు ఐటీడీఏల పరిధిలో 114 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ మంగళవారం తెలిపారు.అంగన్‌వాడీ కార్యకర్తలు 7, ఆయాలు 56, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు 27, పీఎం జనమన్ పథకంలో కొత్తగా మంజూరైన అంగన్‌వాడీ కేంద్రాలలో 24 ఆయాల పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు బుధవారం నుంచి ఏప్రిల్ 10వతేదీ సాయంత్రం ఐదు గంటల లోగా సంబంధిత ఐసీడీఎస్ అధికారికి నేరుగా గాని, పోస్టు ద్వారాగాని దరఖాస్తులు అందజేయాలని చెప్పారు. పై పోస్టులకు దరఖాస్తు చేసే మహిళలంతా తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, వివాహితలైన, స్థానికంగా నివాసం ఉన్నవారు అర్హులని తెలిపారు. 2025 జులై 1నాటికి అభ్యర్థుల వయస్సు 21ఏళ్ల నుంచి 35సంవత్సరాల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఈ వయ స్సు అభ్యర్థులు లేని పక్షంలో 18ఏళ్లు నిండిన అభ్యర్థు దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. ఇది కేవలం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలకే వర్తిస్తుందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణతకు 50 మార్కులు, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, ప్రీ స్కూల్ మేనేజ్‌మెంట్, ఇంటర్మీడియట్ బోర్డు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల ద్వారా పొందిన ధ్రువీకరణ పత్రాలకు 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, మైనర్ పిల్లలు ఉన్న అభ్యర్థులకు 5 మార్కులు, పూర్తిగా అనాథ,క్రెచ్ హోమ్,ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ సత్ప్రవర్తన కలిగిన వారికి 10 మార్కులు,దివ్యాంగులకు 5 మార్కులు,మౌఖిక పరీక్షకు 20 మార్కులు కలిపి మొత్తం 100 ఉంటాయన్నారు.మార్కుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో ఈ పోస్టుల భర్తీ చేయనున్న ట్టు చెప్పారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని కలెక్టర్ తెలిపారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మధ్యవర్తులు,దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. పోస్టుల వివరాలు,దరఖాస్తు ప్రక్రియకు అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాల్లో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.