
పార్ధసారథి హత్య కేసులో మరొకరి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : శనిగపురం శివారు బోరింగ్ తండా సమీపంలో దారుణహత్యకు గురైన దంతాలపల్లి ఎంజేపీ గురుకులం హెల్త్ సూపర్ వైజర్ తాటి పార్ధసారథి హత్య కేసులో మరొకరిని అరెస్ట్ చేశామని రూరల్ సీఐ పి.సర్వయ్య, ఎస్‌ఐ వి.దీపిక తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మృతుడి భార్య స్వప్న, ఆమె ప్రియుడు వెంకట విద్యాసాగర్, తెలగరి వినయ్ కుమార్, బోగ శివకుమార్, మోతుకూరి వంశీని అరెస్ట్ చేశామన్నారు. ఈ క్రమంలో శనివారం మరొకరి అరెస్ట్ చేశామన్నారు. పార్ధసారథిని హత్య చేయడానికి నిర్వహించిన రెక్కీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా రాజావొమ్మంగి మండలం జెడ్డంగి గ్రామానికి చెందిన కూసం లవరాజు పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో అతడిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ, ఎస్‌ఐ పేర్కొన్నారు.