
నిర్దిష్టమైన విధానంలోరహదారుల నిర్మాణం
● కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : రహదారుల నిర్మాణంలో నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, పీఐయూ, ఆర్ అండ్ బీ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రహదారుల నిర్మాణానికి ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా సరైన విధానాన్ని అమలు చేయడం లేదన్నారు. గతంలో నిర్మించిన రహదారులకే మళ్లీ ఎందుకు ప్రతిపాదనలు పంపిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. వంద మీటర్ల రోడ్డు నిర్మాణానికి మండలానికో ఒక రేటు ఎందుకు చెల్లిస్తున్నారని అడిగారు. అనంతరం రహదారుల నిర్మాణం కోసం చెల్లిస్తున్న జీఎస్టీ గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, వర్చువల్‌గా రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సింహాచలం, అపూర్వ భరత్ తదితరులు పాల్గొన్నారు.
జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరణ
పాడేరు రూరల్: రాష్ట్ర నైపుణ్యాభివృధ్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి త్రైమాసిక జాబ్ మేళా క్యాలెండర్‌ను కలెక్టర్ దినేష్‌కుమార్,పాడేరు ఐటీడీఏ ఇన్‌చార్జీ పీవో అభిషేక్‌గౌడ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17న అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు చెప్పారు. పలు ప్రముఖ కంపెనీల్లో నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో పద్మలత,జిల్లా నైపుణ్య అధికారి రోహిణి తదితరులు పాల్గొన్నారు.