నిబంధనలు పక్కాగా అమలు చేయాలి
● డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు ● పరీక్షల నిర్వహణ అధికారులు, స్క్వాడ్ బృందాలతో సమావేశం
అనకాపల్లి టౌన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు నిర్వహణలో నిబంధనలన్నీ పక్కాగా పాటించాల్సిందేనని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు పేర్కొన్నారు. స్ధానిక బీఆర్ అంబేడ్కర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పదో తరగతి పరీక్షల నిర్వహణ అధికారులు, స్క్వాడ్ బృందాల సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఏ రూపంలో ఎవరు భాగస్వాములైనా కఠిన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ఉద్యోగాలతో పాటు క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారన్నారు. పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, కేంద్రాల పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించాలన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాచ్‌లు తదితర పరికరాలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరూ హాల్ టికెట్లు ముందుగా తనిఖీ చేసి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. పదో తరగతి బోర్డు, ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉప విధ్యాశాఖాధికారి పి.అప్పారావు, పరీక్షల విభాగం సహాయ సంచాలకులు ఎ.శ్రీధర్‌రెడ్డి, విద్యాశాఖ, రెవిన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.