పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
తుమ్మపాల: ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు ఏప్రిల్ 1 వరకు రాత పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 107 పరీక్ష కేంద్రాల్లో 22,042 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు సరిగ్గా 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం నుంచి బయటికి వెళ్లడానికి అనుమతి లేదన్నారు. సున్నితమైన పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని, అలాగే క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ డివైజులు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిలేదన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జెరాక్స్, ఇంటర్నెట్ షాపులు మూసివేయాలని ఆదేశించామని తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద గుమికూడడం నిషేధమని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment