
డ్రైవర్‌కు నిద్ర కరువై..
● బోల్తా పడ్డ ప్రైవేటు కంపెనీ బస్సు ● 22మందికి గాయాలు
ఎస్.రాయవరం: కేవలం మూడు గంటల విశ్రాంతి అనంతరం అదే డ్రైవర్ బస్సు నడపాల్సి రావడంతో నిద్ర సరిపోక ప్రమాదానికి దారి తీసింది. 32 మంది కార్మికులతో వస్తున్న సీసీఎల్ ప్రాసెసింగ్ పరిశ్రమకు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. స్థానికులు, ఎస్.రాయవరం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోటవురట్ల మండలం లింగాపురం గ్రామం నుంచి వేకువజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ బస్సు బయలుదేరింది. ఊరూరా కార్మికులను ఎక్కించుకొని వస్తున్న ఈ బస్సు అడ్డురోడ్డు–నర్సీపట్నం ఆర్‌అండ్‌బీ రోడ్డుపై పెదగుమ్ములూరు సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 22మంది గాయపడగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ప్రయాణికులందరినీ నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తీవ్రంగా గాయపడిన 13 మందిని అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన 9మందికి నక్కపల్లి ఆస్పత్రిలో చికిత్స అందించారు. స్వల్పగాయాలతో బయటపడిన 10మందికి చికిత్స అందించి ఇళ్లకు పంపారు.
క్షతగాత్రులు వీరే..
కోటవురట్ల మండలం పందూరు గ్రామానికి చెందిన మానేపల్లి సత్యవతి, గొన్నాబత్తుల స్వాతి, చింతల సాయిలక్ష్మి, యర్రంశెట్టి మంగ, మారిశెట్టి భారతి, చీకట్ల నూకరాజు, సమర్శి మహాలక్ష్మి, సరపాక సంతోషి, మారిశెట్టి హేమలత, సరమశెట్టి వరలక్ష్మి, ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరు గ్రామానికి చెందిన కోసూరి తులసి, హనుమంతు లక్ష్మి, వీరితోపాటు డ్రైవర్ షేక్ సత్తార్ తీవ్రంగా గాయపడ్డారు. నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో కాండ్రకోట నాగమ్మ దేవి, కంటే పార్వతి, చుక్క చిట్టమ్మ, బోదెపు సంధ్య, రాజపతి హిమబిందు, ఆకేటి కుమారి, షేక్ హుస్సేన్, మోటూరి నారాయణమ్మ, మానేపల్లి సత్యవతి చికిత్స పొందుతున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఎస్.రాయవరం తహసీల్దార్ జె.రమేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. నక్కపల్లి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, అడ్డురోడ్డు సీఐ రామకృష్ణ అనకాపల్లి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బస్సు డ్రైవర్ బి షిఫ్ట్ కార్మికులను గడిచిన రాత్రి 11–12 గంటల సమయంలో ఇళ్ల వద్ద దించి, మళ్లీ తెల్లవారుజామున ఏ షిఫ్ట్ కార్మికులను తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. కేవలం మూడు గంటలు మాత్రమే వ్యవధి ఉండడంతో డ్రైవర్‌కు నిద్ర సరిపోక ప్రమాదానికి దారి తీసిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రైవర్‌కు నిద్ర కరువై..
Comments
Please login to add a commentAdd a comment