● బయటపడిన భక్తుడు సమర్పించిన బంగారం
ఆభరణాలను లెక్కిస్తున్న అధికారులు
బుచ్చెయ్యపేట: భక్తులు సమర్పించిన బంగారు, వెండి వస్తువుల వివరాలు వెల్లడించలేదని అభ్యంతరం వ్యక్తం కావడంతో వడ్డాది వేంకటేశ్వరస్వామి హుండీలను బుధవారం మరోసారి లెక్కించారు. ఈనెల 17వ తేదీన హుండీలను తెరిచి రూ.12,75,666 ఆదాయం వచ్చి నట్లు ఈవో శర్మ దేవస్ధానం వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు సమక్షంలో ప్రకటించారు. కేవలం డబ్బులు మాత్రమే ప్రకటించి బంగారు కానుకలు వెల్లడించకపోవడంపై వడ్డాదికి చెందిన భక్తుడు కె.రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగారు వస్తువులు, వెండి వస్తువులు హుండీలో వేసి, నిలువు దోపిడీ చేశామని, ఆ వస్తువులు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. దీంతో బుధవారం దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ వసంత, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మురళి, ఈవో శర్మలు హుండీలు తెరిచి ఆభరణాలను లెక్కించారు. ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా 13.5 గ్రాముల బంగారం,138 గ్రాముల వెండి వస్తువులు వచ్చినట్లు ప్రకటించారు. అలాగే గత 28 ఏళ్లలో కేజీ 600 గ్రాముల వెండి వస్తువులు, 0.8 గ్రాముల బంగారు వస్తువులు వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో పలువురు భక్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. గత 28 ఏళ్లలో వచ్చిన వస్తువులు ఇంతేనాఅని ప్రశ్నించారు. ఇకపై దేవస్ధానంలో భక్తులు అందించిన కానుకలను సక్రమంగా వెల్లడించకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.