
ఆర్టీసీ కండక్టర్ అనుమానాస్పద మృతి
సబ్బవరం: టెక్కలిపాలెం గ్రామం సమీపంలోని రైవాడ కాలువలో వాల్తేరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ గిడితూరి వెంకటరమణ (54) ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కై లాసపురం కస్తూరినగర్‌లో నివాసం ఉంటున్న వెంకటరమణ స్వగ్రామం టెక్కలిపాలెం. అతని తండ్రి ముత్యాలు డీఎల్‌బీలో ఉద్యోగం చేయడంతో కై లాసపురంలో స్థిరపడ్డారు. అయితే స్వగ్రామం టెక్కలిపాలెంలో భూమి కొనాలని వెంకటరమణ భావించి, బంధువులతో మాట్లాడారు. ఈ మేరకు తన స్నేహితుడు వాసుపల్లి ఎల్లాజీతో కలిసి ఆదివారం ఉదయం రూ.20 వేలు తీసుకుని టెక్కలిపాలెం వచ్చారు. భూమి కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య బేరం కుదరకపోవడంతో మధ్యాహ్నం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అయితే సాయంత్రం 6 గంటల సమయంలో వెంకటరమణ రైవాడ కాలువలో స్నానానికి వెళ్లి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి పెద్ద కుమారుడు లీలా వంశీనాథ్ సోమవారం ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.