
జిల్లాలో స్పెషల్ డ్రైవ్‌గా తడి, పొడి చెత్త సేకరణ
నక్కపల్లి: జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ తడి, పొడి చెత్తను ఇళ్ల వద్ద నుంచే సేకరించే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషారాణి తెలిపారు. గ్రామాల్లో శుక్రవారం పంచాయతీ, సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాల మేరకు తడి, పొడి చెత్తను సేకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రం నక్కపల్లిలో తడి, పొడి చెత్తను సేకరించే కార్యక్రమాన్ని డీపీవో స్వయంగా పరిశీలించారు. పంచాయతీ స్వీపర్లు, గ్రీన్ అంబాసిడర్ల సాయంతో ప్రతి ఇంటికి వెళ్లి ప్లాస్టిక్ డబ్బాల్లో తడి, పొడి చెత్తను సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాస్(స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర) కార్యక్రమంలో భాగంగా ఇళ్ల వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందజేయాలన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అంటువ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. వీధులు అపరిశుభ్రంగా ఉంటున్నాయని చెప్పారు. సాస్ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ ప్రక్రియను రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఒకేసారి చేపడుతున్నామన్నారు. ప్రజల్లో కూడా విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇళ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను సంపద తయారీ కేంద్రాల వద్ద వేర్వేరుగా ఉంచి వానపాముల సాయంతో వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నట్టు చెప్పారు. చినదొడ్డిగల్లు సంపద తయారీ కేంద్రాల వద్ద కార్యక్రమాలను మండల ప్రత్యేకాధికారి ప్రసాద్ పరీశీలించారు. తడి, పొడి చెత్తను సిబ్బంది వేరు చేశారు. కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో మూర్తి, వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, సర్పంచ్ చంద్రరావు, ఎంపీడీవో సీతారామరాజు, ఉప సర్పంచ్ వీసం రాజు, పంచాయతీ కార్యదర్శి బీఏబీఎల్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లో విస్తృత అవగాహన అవసరం
డీపీవో శిరీషారాణి