
విద్యుత్ షాక్ తగిలి రైతు సజీవదహనం
నక్కపల్లి : మండలంలోని జానకయ్యపేటలో విద్యుత్ షాక్ తగిలి ఈగల తాతబ్బాయి(80) అనే రైతు సజీవ దహనమయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఈగల తాతబ్బాయి శనివారం ఉదయం తన కొబ్బరి తోటకు వెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన దేవర కృష్ణ తోటలో తాటిచెట్టు కరెంటు తీగలపై పడడంతో తోటలోకి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్లు తెగి కాలిబాటలో పడ్డాయి. వీటిని గమనించకుండా వెళ్లిన తాతబ్బాయి తెగి పడిన వైర్లను కాలితో తొక్కడంతో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. తీగలనుంచి మంటలు వ్యాపించి తాతబ్బాయి శరీరం పూర్తిగా కాలిపోయింది, దీంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ సింహాచలం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కురందాసు నూకరాజు, ఎస్‌ఐ సన్నిబాబులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద విషయాన్ని తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగల వల్ల మృత్యువాత పడిన తాతబాబ్బయి కుటుంబాన్ని ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

విద్యుత్ షాక్ తగిలి రైతు సజీవదహనం