
ముగ్గురు బైకు దొంగల అరెస్టు
● 9 బైక్‌లు స్వాధీనం
బుచ్చెయ్యపేట : మండలంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 9 బైక్‌లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ శ్రావణి తెలిపారు. సోమవారం బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్ వద్ద బైక్‌లను, దొంగతనానికి పాల్పడిన యువకుల వివరాలను ఎస్‌ఐ శ్రీనివాసరావుతో కలిసి ఆమె వెల్లడించారు. పోలీసులు సాధారణ వాహనాల రికార్డుల తనిఖీల్లో భాగంగా విజయరామరాజుపేట గ్రామానికి చెందిన యువకుడిని పట్టుకుని ఆరా తీయగా రికార్డులు లేకపోవడంతో బైక్ దొంగిలించినట్టుగా గుర్తించామన్నారు. యువకుడిని విచారణ చేయగా ఇతనితో పాటు ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కలిసి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారన్నారు. బుచ్చెయ్యపేట, చోడవరం, అనకాపల్లి టౌన్, కంచరపాలెం, దువ్వాడ, విశాఖ ప్రాంతాల్లో బైక్‌లు దొంగతనం చేసినట్టు ముగ్గురూ ఒప్పుకున్నారన్నారు. వీరు దొంగతనం చేసిన 9 బైక్‌లను స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.