
నిరసనలతో హోరెత్తిన కలెక్టరేట్
● ఫిర్యాదులపై స్పందన ఎక్కడ? ● గేటు బయటే దివ్యాంగులు ● అర్జీదారుడికి మాత్రమే లోపలికి అనుమతి
తుమ్మపాల: కలెక్టరేట్ సోమవారం నిరసనలతో హోరెత్తింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీదారులు నినదించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం అర్జీదారులతో కిటకిటలాడింది. పలు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ గేటు బయట పలువురు నిరసనలు తెలిపారు. అధికారుల తీరుకు నిరసనగా పలువురు కూటమి పార్టీల నాయకులు కూడా నేరుగా ఆందోళన చేయడం గమనార్హం.
దివ్యాంగులకు తప్పని నిరీక్షణ
జిల్లాలోని దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో దివ్యాంగులు కార్యాలయం లేక ఎదురవుతున్న ఇబ్బందులను అనేక రూపాల్లో చేసిన నిరసనలకు నేటికి ఫలితం లేకుండా పోయింది. వారానికి ఒక్క రోజు చేపట్టే పీజీఆర్‌ఎస్‌లో తమ మొరను తెలిపేందుకు వ్యయ ప్రయాసలతో వస్తే వారిని కలేక్టరేట్ బయటే సిబ్బంది అడ్డుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. గేటు దాటి లోపలికి వెళ్లే అవకాశం లేక వారి వద్దకు వచ్చే అధికారుల రాక కోసం గంటల పాటు నిరీక్షిస్తున్నారు. తీరా వారి వద్దకు వచ్చిన అధికారులు సమస్య తమ పరిధి కాదంటూ అర్జీలు తీసుకుని చేతులు దులుపుకోవడంతో తమ సమస్యలకు పరిష్కారం చూపే నాథులే కరువయ్యారంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోపలికి అనుమతి నిరాకరణ
సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని తమ గోడును జిల్లా అధికారులకు విన్నవించుకుందామని కలిసికట్టుగా వస్తున్న వారిని లోపలికి అనుమతించడం లేదు. వృద్ధ దంపతులు, కుటుంబ సభ్యుల తోడుతో వచ్చే నిరక్షరాస్యులు, నడవగలిగే వికలాంగుల్లో ఒక్కరిని మాత్రమే కలెక్టరేట్ లోపలికి అనుమతిస్తూ.. వారికి తోడుగా వచ్చిన వారిని సిబ్బంది బయటకు నెట్టేస్తున్నారు. దీంతో పాటు అధికారులకు అర్జీలిచ్చే క్రమంలో ఫొటోలు తీసుకునే పరిస్థితి కూడా లేకుండాపోయింది. సిబ్బందికి చెప్పి ఫొటోలు తీయకుండా చూస్తున్నారు.
సకాలంలో అర్జీలకు పరిష్కారం : కలెక్టర్
తుమ్మపాల: పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టరు విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఅర్‌ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు జేసీ ఎం.జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, పత్యేక డిప్యూటీ కలెక్టరు ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల గురించి వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం కాని అర్జీల గురించి కారణాలను వివరంగా దరఖాస్తుదారుడికి తెలియజేస్తే అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు. మొత్తం 394 అర్జీలు నమోదు కాగా.. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 246 అర్జీలు వచ్చాయి. పంచాయతీ రాజ్, పోలీస్, సర్వే, విద్యుత్, గ్రామీణ మంచినీటి సరఫరా, వాటర్ రిసోర్స్, గ్రామీణ అభివృద్ధి, మున్సిపాటిటీ, హౌసింగ్, మొత్తం 40 శాఖల్లో అర్జీలు స్వీకరించారు.
అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలి
తుమ్మపాల: రోలుగుంట మండలం శరభవరం పంచాయతీ పరిధిలోని రాజన్నపేట గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా క్వారీ యజమానులు పట్టించుకోవడం లేదని చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి పీఎస్‌ఎన్ రాజు ఆరోపించారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఆయన మళ్లీ ఫిర్యాదు చేశారు. క్వారీ నిర్వాహకులు అనుమతులు తీసుకోకుండా నీటిపారుదల ట్యాంకు మీదుగా రహదారిని నిర్మించి రైతుల వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. క్వారీ చుట్టూ ఉన్న సమీప గృహాలు, సాగు భూములకు తీవ్రనష్టం వాటిల్లుతోందన్నారు. వడ్డిప, బుచ్చయ్యపేట గ్రామాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, క్వారీ లీజుదారులు చేసిన అక్రమాలపై మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయత్ రాజ్ శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు.

నిరసనలతో హోరెత్తిన కలెక్టరేట్

నిరసనలతో హోరెత్తిన కలెక్టరేట్