సాక్షిపై కేసుల్ని ఖండించిన పాత్రికేయులు
సీతమ్మధార (విశాఖ):
సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని కోరుతూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక బ్యూరోచీఫ్ కేజీ రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ సాక్షి దినపత్రిక నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సాక్షి అనకాపల్లి, అల్లూరి జిల్లాల డెస్క్ ఇన్‌చార్జి బీబీ సాగర్ మాట్లాడుతూ సాక్షి ఎడిటర్‌తో సహా ఆరుగురు పాత్రికేయులపై కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకు విఘాతమన్నారు. ఒక హత్యకేసులో బాధితుల పక్షాన నిలిచి వాస్తవాలు వెలికితీయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వార్తలో పేర్కొన్న విషయాల్లో నిజనిజాలను ఖరారు చేసుకుని నిందితులపై చర్యలు తీసుకోవడం మాని, పాత్రికేయులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు ఏటీ రామునాయుడు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో జరిగిన హత్యోదంతంలో దోషులను శిక్షించాల్సింది పోయి, వార్త కవర్‌చేసిన సాక్షి మీడియా జర్నలిస్టులపైనా, మీడియాపైనా కేసులు నమోదుచేయడం సరికాదన్నారు. సాక్షి ఎడిటర్‌తో పాటు ఇద్దరు జర్నలిస్టులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమండ్ చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకుడు డి.ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ వార్త కవర్ చేసిన సాక్షి మీడియా జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సీనియర్ జర్నలిస్టు పిల్లా విజయకుమార్ మాట్లాడుతూ యాజమాన్యాల మీద ఉన్న కోపాన్ని వృత్తి ధర్మం నిర్వహిస్తున పాత్రికేయులపై ప్రదర్శించడం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు అనేష్‌కుమార్, ఏపీడబ్ల్యూజే అనుబంధ సామ్నా జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణకిశోర్, భీమిలి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రమణప్రసాద్, పలు ప్రెస్‌క్లబ్‌ల కార్యవర్గసభ్యులు, అధిక సంఖ్యలో పలు మీడియాలకు చెందిన పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో..
అనకాపల్లి: పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం తీసుకున్న మొండి వైఖరిని తక్షణమే విడనాడాలని అనకాపల్లి ప్రెస్‌క్లబ్ (ఏపీయూడబ్ల్యూజే) నియోజకవర్గ అధ్యక్షుడు మళ్ల భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి గణేష్‌లు అన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఆరుగురు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ క్రిమినల్ కేసులను ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసి, ఏవో బి.సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరిగే అక్రమాలు, అన్యాయాలను పత్రికలు వెలికితీస్తాయని, అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పి.వీరబాబు, బి.మధుసూదనరావు, మంత్రి నారాయణమూర్తి, వేగి రామచంద్రరావు, కర్రి గంగాధర్, కోన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పత్రికా స్వేచ్ఛకు విఘాతం