
ఘనంగా ఉరుసు ఉత్సవం
కశింకోట: మండలంలోని బయ్యవరం వద్ద వెలసి ఉన్న హజరత్ అన్సర్ మద్నీ ఔలియా దర్గా ఉరుసు షరీఫ్ (చందనోత్సవం) శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా జిల్లాతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఒడిస్సా, టాటా నగర్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ముస్లింలతోపాటు స్థానిక హిందూవులు బారులు తీరి దర్గాను దర్శించి ప్రార్థనలు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు గుంపులుగా సంప్రదాయ వస్త్రధారణతో తరలి వచ్చి సంప్రదాయంగా చందనం పూసి చాదర్లు కప్పి గులాబీ పూలు జల్లి ప్రార్థనలు చేశారు. తీపి పదార్థాలు, ఖర్జూరం, పండ్లను ప్రసాదంగా నివేదించారు. ఉదయం గుసుల్ షరీఫ్ (చందనం పూయుట) నిర్వహించారు. సాయంత్రం పాతియాఖాని అనంతరం తబురుక్ (ప్రసాద వితరణ) చేశారు. దర్గా ముతవల్లి అబ్దుల్ మాకీం, కార్యదర్శి మహమ్మద్ అయాజ్, అనకాపల్లి జామియా మసీదు కమిటీ అధ్యక్షుడు పి.ఎస్.ఎన్ హుస్సేన్, మదీన మసీద్ అధ్యక్షుడు ఎస్.ఎ. దావూద్ అలీ తదితరులు దర్గాను దర్శించారు. దర్గాను అందంగా విద్యుద్దీపాలతో అలంకరించారు.
ఈ సందర్భంగా తీర్థ మహోత్సవం జరిగింది. అలంకరణ వస్తువులు, తిను బండారాలు, పూజా సామగ్రి అమ్మకాలు జోరుగా సాగాయి. ఆకాశ చక్రాలు, రంగుల రాట్నం, ఫోం జారుడు బల్లలపై పిల్లలతో పాటు పెద్దలు ఆనందంగా తిరుగాడారు. డీఎస్పీ శ్రావణి, సీఐ అల్లు స్వామి నాయుడు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

ఘనంగా ఉరుసు ఉత్సవం