విషం దా‘జేసీ’.. వేషం కట్టేసి!
తాడిపత్రిలో అలజడి రేపేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు
ఒళ్లంతా విషం నింపుకుని ‘శాంతి కాముకుడి’లా బిల్డప్
ఎన్ని వేషాలేసినా నమ్మబోమంటున్న ప్రజలు
గతంలో కక్షలు రాజేసి పబ్బం గడుపుకోలేదా అంటూ విమర్శలు
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లుంది జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరు. అధికారమే అండగా ఒకప్పుడు తాడిపత్రి నియోజకవర్గంలో కక్షలు, కార్పణ్యాలు రాజేసిన ఆయన నేడు తనను తాను శాంతికాముకుడిలా బిల్డప్ ఇస్తుండడంపై జనం నవ్వుకుంటున్నారు. ఒళ్లంతా విషం నింపుకుని ఒంటిపై శాలువ, నుదుటిపై విబూది పెట్టినంత మాత్రాన అరాచకాలు మరచిపోగలమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
తాడిపత్రిరూరల్: ‘శంఖారావం’ సభలో పాల్గొనేందుకు సోమవారం టీడీపీ నేత నారా లోకేష్ తాడిపత్రి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కంట్లో పడేందుకు జేసీ చేస్తున్న డ్రామా అందరికీ నవ్వులు తెప్పిస్తోంది. పట్టణ పోలీసు స్టేషన్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీ అందరినీ పగలబడి నవ్వేలా చేస్తోంది. ‘దొంగే దొంగ.. దొంగ’ అన్న చందంగా ఉందని ఫ్లెక్సీని చూసి పలువురు విమర్శలు గుప్పించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అందులోని అక్షరాలు ఉన్నాయని మండిపడ్డారు.
అరాచకాలు మరువగలమా జేసీ..!
అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలను తన ప్రాపకం కోసం రెండుగా చీల్చారు. కక్షలు, కార్పణ్యాలు రాజేశారు. తాడిపత్రి మండలం వీరాపుం గ్రామంలో జేసీ ప్రభాకర్ రెడ్డి రాజేసిన చిచ్చు ఇప్పటికీ చల్లారడం లేదంటే అతిశయోక్తి కాదు. తన రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గ్రామస్తులను రెచ్చ గొట్టి రెండు వర్గాలుగా చీలగొట్టారు. నిప్పు రాజేసి తమకు కావాల్సిన సమయంలో ఆజ్యం పోశారు. వీరి వికృత చేష్టలు గత ఎన్నికల సమయంలో ఏకంగా భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి హత్యకు దారి తీశాయి. ప్రశాంతంగా ఉన్న ఇగుడూరు గ్రామంలో సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో వర్గ కక్షలకు తెరలేపారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పొలాల్లో చెట్లు పీకేయించడం, బోర్లు పగుల గొట్టడం తదితర చర్యలకు ఉసిగొల్పి రాక్షసానందం పొందారు.
► అధికార దాహంతో కన్నూమిన్నూ కానరాకుండా వ్యవహరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వగ్రామంలో చిచ్చు రాజేయాలని చూశారు. పెద్దారెడ్డి రాజకీయంగా ఎదుగుతుండడం చూసి ఎలాగైనా దెబ్బగొట్టేందుకు ఆయన స్వగ్రామం తిమ్మంపల్లివాసులను రెండు వర్గాలుగా విడగొట్టారు. గ్రామంలో తన అనుచరునికి ఇల్లు కొనుగోలు చేయించి కక్షలు రాజేశారు. పెద్దారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. అంతటితో ఆగక ‘నేను నీ ఊరొచ్చా, ధైర్యం ఉంటే నీవు తాడిపత్రికి రావాలంటూ’ పెద్దారెడ్డిని రెచ్చగొట్టారు. జేసీ చాలెంజ్‌ను స్వీకరించిన పెద్దారెడ్డి ఆయన కోరినట్లుగానే తాడిపత్రికి వచ్చారు. అప్పటికే జేసీ సోదరుల ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు పెద్దారెడ్డికి జై కొట్టారు. ఎన్నికల్లో జేసీ తనయుడిని చిత్తుచిత్తుగా ఓడించారు.
అయినా, జేసీ ప్రభాకర్ రెడ్డికి బుద్ధి మాత్రం రాలేదు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పటికీ నియోజకవర్గవ్యాప్తంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. తన అనుచరులను రెచ్చగొడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో మళ్లీ అలజడులు రేకెత్తిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ సీపీ నాయకులను కవ్వించేందుకు తానేదో మంచికి మారు పేరు అన్నట్లుగా ఫ్లెక్సీలు కట్టించుకున్నారు. గతంలో ఆయన చేసిన అరాచకాలను చూసిన ప్రజలు ఇదంతా చూసి నవ్వుకుంటున్నారు. ఇతనికెప్పటికి బుద్ధి వస్తుందో అంటూ నిట్టూరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment