రైతన్నల గుండెల్లో రాజముద్ర | - | Sakshi
Sakshi News home page

రైతన్నల గుండెల్లో రాజముద్ర

Published Mon, Jul 8 2024 1:56 AM | Last Updated on Mon, Jul 8 2024 7:36 AM

-

వైఎస్సార్‌ హయాంలో పండుగలా వ్యవసాయం

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13 వేల కోట్ల వ్యయం

ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, పంటల బీమాతో అన్నదాతలకు బాసట

తండ్రికి తగ్గ తనయుడిగా రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్‌ జగన్‌

రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.8 వేల కోట్లు జమ

ప్రకృతి కన్నెర్ర చేసింది. పాలకుల కరుణ కరువైంది. వరుణుడు పత్తా లేకుండా పోయాడు.వర్షాలు లేక, పంటలు పండక 1993 నుంచి 2004 మధ్య కాలంలో కరువు రక్కసి కబంధ హస్తాల్లో ‘అనంత’ రైతన్న చిక్కుకున్నారు. అలాంటి తరుణంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆశాకిరణంగా కనిపించారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి అన్నదాత దిక్కులు చూస్తున్న సమయంలో అపర భగీరథుడిగా నిలిచారు. 

చేతిలో చిల్లిగవ్వ లేక పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న కూలీలు, పేదల ఇంటికి పెద్ద కొడుకయ్యారు. పుట్టెడు అప్పులతో పిల్లల్ని చదివించలేక, ఆత్మాభిమానం చంపుకోలేక అర్ధంతరంగా అసువులు బాసిన రైతుల కుటుంబాలతో పాటు, పేదలకు అండగా నిలిచారు. అన్ని వర్గాలకూ అందరి బంధువయ్యారు. అందుకే ఆయన తనువు చాలించి 15 యేళ్లు కావస్తున్నా నేటికీ అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు మహానేత వైఎస్సార్‌ 75వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

అనంతపురం అగ్రికల్చర్‌: 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేదికపై ఉచిత కరెంటు, విద్యుత్‌ బిల్లుల మాఫీ చేస్తూ తొలి సంతకంతోనే దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఊపిరిపోశారు. ఆ ఒక్క సంతకంతో ఉమ్మడి జిల్లా రైతులకు చెందిన రూ.70.65 కోట్ల విద్యుత్‌ బిల్లులు మాఫీ అయ్యాయి. ఐదేళ్లూ 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు రూ.వందల కోట్ల విలువ చేసే కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. ఖరీఫ్‌లో పంట రుణాల పంపిణీ రూ.6,594 కోట్లకు చేర్చారు. పావలా వడ్డీ కింద రూ.44 కోట్లు ఇచ్చారు.

పంటల బీమాతో ధీమా..
అప్పట్లో చంద్రబాబు హయాంలో అమలవుతున్న పంటల బీమా పథకాన్ని మార్పు చేసి రైతులకు ఎనలేని ధీమా కల్పించారు. 2004–2009 మధ్య వైఎస్‌ హయాంలో వేరుశనగ రైతులకు పంట కోత ఫలితాల ఆధారంగా బీమా కింద ఏకంగా రూ.1,138 కోట్ల పరిహారం దక్కింది. అలాగే ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.100 కోట్లు అందింది.

ఒకే విడతగా రుణమాఫీ..
2008లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో వైఎస్సార్‌ 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్ల రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాల కింద 3,61,269 మందికి రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద రుణమాఫీ, ప్రోత్సాహకాల కింద ఒకే విడతగా 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్ల లబ్ధి చేకూర్చారు.

రాయితీతో విత్తనాలు..
ఖరీఫ్‌, రబీలో రైతులకు లక్షల క్వింటాళ్ల వేరుశనగ, పప్పుశనగ, కంది, ఇతర విత్తనాలు రాయితీతో ఇచ్చారు. 2004– 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్ల వేరుశనగ అందజేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు.

అనుబంధ రంగాలకూ ప్రాధాన్యత..
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటలు, డ్రిప్‌, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూత అందించారు. రూ.25 కోట్ల రాయితీ ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీర విప్లవానికి నాంది పలికారు. 40 వేల హెక్టార్ల పండ్లతోటల విస్తరణకు రూ.80 కోట్ల సబ్సిడీ అందజేశారు. దీంతో అప్పట్లోనే ‘ఫ్రూట్‌బౌల్‌ ఆఫ్‌ ఏపీ’గా పేరొచ్చింది. బిందు, తుంపర (డ్రిప్‌, స్ప్రింక్లర్లు) పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో అందజేశారు. సూక్ష్మసేద్యం విస్తరణకు రూ.280 కోట్ల రాయితీ ఇవ్వడంతో 1.13 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇలా వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఏకంగా రూ.13 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు.

అంతకు మించి..
తండ్రి వైఎస్సార్‌కు తగ్గ తనయుడిగా గత ఐదేళ్ల కాలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అంతకు మించి అన్నట్లుగా అన్నదాతకు అడుగడుగునా అండగా నిలిచింది. కరోనా కాలంలో ఉద్యాన ఉత్పత్తుల అమ్మకాలకు ప్రోత్సాహం లాంటివే కాకుండా కేవలం రైతు సంక్షేమానికి ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వెచ్చించారు. దేశంలో తొలిసారిగా ఊరూరా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థతో వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా ఇన్‌పుట్స్‌ కోసం గ్రామం దాటి వెళ్లకుండా 867 ఆర్‌బీకేలను నిర్మించారు. 

విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరిశీలనకు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ ల్యాబ్‌లతో పాటు పశుసంపద, జీవాల రక్షణకు వెటర్నరీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. 108 మాదిరిగా 1962 కింద మొబైల్‌ వెటర్నరీ అంబులెన్సులు తెచ్చారు. రైతు గ్రూపులకు ప్రతి ఆర్‌బీకే పరిధిలో రూ.15 లక్షలు వెచ్చించి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు (సీహెచ్‌సీ) కింద ట్రాక్టర్లు, ఇతర అధునాతన యంత్ర పరికరాలు అందించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఏటా మూడు విడతల్లో రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద రూ.13,500 పెట్టుబడి సాయం ఇచ్చారు. ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా ‘ఈ–క్రాప్‌’, ఈ–కేవైసీ పారదర్శకంగా చేపట్టారు. రాయితీతో డ్రిప్‌, స్ప్రింక్లర్లు అందించారు. ఇలా వ్యవసాయ, అనుబంధ రంగాల పురోభివృద్ధికి అడుగడుగునా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సహకారం అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement