విద్యుత్‌ శాఖలో డిప్యుటేషన్ల లీల | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ శాఖలో డిప్యుటేషన్ల లీల

Published Mon, Mar 3 2025 1:00 AM | Last Updated on Mon, Mar 3 2025 12:58 AM

విద్య

విద్యుత్‌ శాఖలో డిప్యుటేషన్ల లీల

● శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం విద్యుత్‌ డివిజన్‌ పరిధిలోని చెన్నేకొత్తపల్లి సెక్షన్‌లో పని చేస్తున్న సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ సూర్యనారాయణ డిప్యుటేషన్‌పై అనంతపురం నగరంలోని బళ్లారి రోడ్డులో ఉన్న డీ5 సెక్షన్‌లో నాలుగు నెలలుగా పనిచేస్తున్నారు. ఇందుకు గాను అప్పట్లో అనంతపురం విద్యుత్‌ సర్కిల్‌లో పనిచేసిన ఓ ఎస్‌ఈని అన్ని విధాలుగా సంతృప్తి పరిచి ప్రసన్నం చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు ఆగమేఘాలపై అనంతపురం జిల్లాకు డిప్యుటేషన్‌ ఆర్డర్‌ ఇచ్చేసినట్లుగా సొంత శాఖలోని ఉద్యోగులే చెబుతున్నారు. ఫలితంగా చెన్నేకొత్తపల్లి సెక్షన్‌లో ఎస్‌ఎల్‌ఐ కొరత వేధిస్తూ ఉంది.

● గుత్తి విద్యుత్‌ డివిజన్‌ పరిధిలో పనిచేస్తున్న ఓ లైన్‌మెన్‌, కళ్యాణదుర్గం డివిజన్‌లో పనిచేస్తున్న ఓ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, పుట్టపర్తిలో పనిచేస్తున్న ఓ ఫోర్‌మెన్‌ డిప్యుటేషన్‌పై నగరంలోకి వచ్చి దాదాపు 6 ఏళ్లు గడుస్తోంది. ఏటా ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ అనంతపురం నగరంలోని వివిధ సెక్షన్లలో వారు కొనసాగుతుండడం గమనార్హం.

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ శాఖ అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగులకు అనాధికారికంగా డిప్యుటేషన్లు ఇస్తూ వారికి అనుకూలంగా ఉన్న ఉద్యోగులను నగరంలోకి తీసుకువచ్చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలను విద్యుత్‌ ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకున్న జిల్లా వ్యాప్తంగా 50మందికి పైగా క్షేత్రస్థాయి ఉద్యోగులు.. నిబంధనలకు విరుద్దంగా డిప్యుటేషన్‌పై అనంతపురంలోని వివిధ సెక్షన్లలో కొనసాగుతున్నారు. వీటితోపాటు సర్కిల్‌ కార్యాలయంలోనూ పదుల సంఖ్యలో ఉద్యోగులను అంతర్‌ జిల్లాల డిప్యుటేషన్లపై అనంతపురానికి రప్పించుకున్నారంటే ఉన్నతాధికారులు ఏ స్థాయిలో పైరవీలు సాగించారో అర్థమవుతోంది.

వేధిస్తున్న ఉద్యోగుల కొరత..

విద్యుత్‌ శాఖలో అక్రమ డిప్యుటేషన్ల కారణంగా రూరల్‌ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి విద్యుత్‌ ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సమస్యలు అధికంగా వేసవిలోనే ఉత్పన్నమవుతుంటాయి. ఇంతటి కీలకమైన సమయంలోనూ అధికారులు అక్కడ పోస్టులను భర్తీ చేయకుండా అనధికారికంగా డిప్యుటేషన్లను ఇచ్చేస్తూ ఉద్యోగులు కోరుకున్న ప్రాంతాలకు పంపించేస్తున్నారు. అనంతపురం నగర పరిధిలో ఆరు విద్యుత్‌ సెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ దాదాపు 25 మందికి పైగా లైన్‌ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు, ఫోరుమెన్లు, జూనియర్‌ లైన్‌మెన్లు డిప్యుటేషన్‌పై కొనసాగుతుండడం గమనార్హం. అక్రమ డిప్యుటేషన్ల అంశంలో ఉన్నతాధికారుల తీరుపై కొందరు ఉద్యోగులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

రద్దు చేస్తాం

విద్యుత్‌ శాఖలో డిప్యుటేషన్‌ అనే విధానమే లేదు. అయితే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు వైద్యుల సూచన మేరకు డిప్యుటేషన్‌ ఇచ్చేందుకు అవకాశం ఉంది. డిప్యుటేషన్లపై పదుల సంఖ్యలో నగరంలో తిష్ట వేసిన ఉద్యోగులపై విచారణ చేపట్టి వారి డిప్యుటేషన్లను రద్దు చేస్తాం. వారిని పాత స్థానాల్లోకి వెళ్లేలా రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటాం.

– శేషాద్రి శేఖర్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ, అనంతపురం

కొన్నేళ్లుగా నగరంలోనే తిష్ట 50 మందికి పైగా ఉద్యోగులు వివిధ సెక్షన్లలో పాగా రూరల్‌ ప్రాంతాలను వేధిస్తున్న ఉద్యోగుల కొరత

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యుత్‌ శాఖలో డిప్యుటేషన్ల లీల 1
1/1

విద్యుత్‌ శాఖలో డిప్యుటేషన్ల లీల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement