50 శాతం రాయితీతో యాంత్రీకరణ పనిముట్లు
అనంతపురం అగ్రికల్చర్: పీఎం–ఆర్‌కేవీవై, ఎస్‌ఎంఏఎం పథకాల కింద ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రైతులకు 50 శాతం రాయితీతో 1,661 యాంత్రీకరణ పనిముట్ల మంజూరుకు రూ.2.86 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఆగ్రోస్ ద్వారా 250 స్ప్రేయర్లు, 600 పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, ఏడు ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, 740 ట్రాక్టర్ డ్రాన్ సీడర్ పరికరాలు, 28 రోటావీటర్లు, 18 పవర్‌వీడర్లు, 13 బ్రష్ కట్టర్లు, ఐదు పవర్ టిల్లర్లు ఇవ్వనున్నారు. గత ఐదేళ్లుగా పనిముట్ల లబ్ధిపొందని ఎస్సీ ఎస్టీ మహిళా రైతులు, చిన్న సన్నకారు రైతులు అర్హులు. ఈ–పంట నమోదు తప్పనిసరిగా ఉండాలి. అటవీ భూముల సాగుదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ట్రాక్టర్ కలిగిన రైతులు మాత్రమే వాటికి సంబంధించిన పనిముట్లకు దరఖాస్తు చేసుకోవాలి. రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి ఈ నెల 26 లోపు దరఖాస్తులు అందజేయాలి.
ఏపీఎఫ్‌ఆర్ గుర్తింపు కార్డు తప్పనిసరి : జేడీఏ
యాడికి: ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ(ఏపీఎఫ్‌ఆర్) గుర్తింపు కార్డు కలిగి ఉంటేనే భవిష్యత్తులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, రైతులందరూ తప్పనిసరిగా ఏపీఎఫ్‌ఆర్ కార్డును పొందాలని జేడీఏ ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. యాడికి మండలం వేములపాడులోని రైతు సేవా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె రైతులతో సమావేశమై మాట్లాడారు. రైతు గుర్తింపు కార్డులు లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వర్తించవన్నారు. రబీలో దిగుబడులు సరిగ్గా లేనందున యాడికి మండలాన్ని కరువు ప్రాంతంగా ఖరారు చేయుటకు ప్రతిపాదనలు పంపామన్నారు. పంటల యాజమాన్యంపై ఎప్పటికప్పుడు రైతు సేవాకేంద్రం ద్వారా సలహాలు తీసుకుని మంచి దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా, వ్యవసాయ విస్తరణ అదికారి జహిరూన్, గ్రామ వ్యవసాయ అధికారి సతీష్ బాబు పాల్గొన్నారు.
ఈ –క్రాప్ నమోదు త్వరగా పూర్తి చేయండి
పెద్దవడుగూరు: రబీ పంటకు సంబంధించి రైతులు సాగు చేసిన పంటల వివరాల ఈ క్రాఫ్ నమోదు త్వరగా పూర్తి చేయాలని సంబంధింత అధికారునలు జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. మంగళవారం పెద్దపప్పూరు మండలం జూటూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీఎఫ్‌ఆర్ గుర్తింపు కార్డు ప్రాధాన్యతపై చైతన్య పరిచారు. కంది పంటకు ప్రభుత్వం రూ.7,550 గిట్టుబాటు ధర కల్పించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ ఆంజనేయులు, రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment