ఆర్‌ఎంపీలు పరిధికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు
● డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి
రాయదుర్గంటౌన్: ఆర్‌ఎంపీలు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని, వారి పరిధికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈబీ దేవి హెచ్చరించారు. ఇటీవల రాయదుర్గంలోని బళ్లారి రోడ్డులో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడు చన్నవీర వైద్యం వికటించి ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులతో విచారణ అనంతరం స్థానిక ఎపీఎన్జీఓ భవనంలో అర్బన్, రూరల్ పరిధిలోని ఆర్‌ఎంపీలతో ఆమె సమావేశమై మాట్లాడారు. ప్రాథమిక చికిత్స దాటి ఎవరైనా ఆర్‌ఎంపీలు వైద్యం అందజేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కచ్చితంగా వారిపై చర్యలతోపాటు సర్టిఫికెట్ రద్దు చేస్తామన్నారు. ఇంజక్షన్లు వేయడం, సెలెన్ ఎక్కించడం లాంటి వైద్యం చేయరాదన్నారు. సమావేశంలో వైద్యులు రమేష్, మోహన్‌సాయి, సందీప్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బాలుడి మృతదేహం వెలికితీత
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన దుర్గేష్, ప్రీతి దంపతుల కుమారుడు దర్శిత్ (12) ఆదివారం ఈతకు వెళ్లి నీటి కుంటలో గల్లంతైన విషయం తెలిసిందే. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువుల సమాచారంతో కదిరి రూరల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు అక్కడకు చేరుకుని సోమవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం బాలుడు దర్శిత్ మృతదేహం లభ్యమైంది. కుమారుడి మృతదేహాన్ని చూడగానే తండ్రి సొమ్మసిల్లిపోయాడు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment