అబ్బేదొడ్డిలో చిరుత కలకలం
గుత్తి రూరల్: మండలంలోని అబ్బేదొడ్డి గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. మూడు నెలలుగా సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామ శివారులోని రిజర్వాయర్ వద్దకు వస్తూ రైతులు, గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు రోజుల క్రితం గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి ప్రయాణికులతో ఆటో వెళ్తుండగా రెండు చిరుతలు రోడ్డు దాటుతూ కనిపించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గురువారం వేకువజామున మాముడూరు గ్రామానికి వెళ్లే దారిలో చిరుత కనిపించింది. రైతులు ఓ చెట్టు పక్కన దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. చిరుత పాదముద్రల ఫొటోలు తీసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
యాజమాన్య
పద్ధతులు పాటించాలి
● ఉద్యాన అధికారి నరసింహరావు
గార్లదిన్నె: చీనీ రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహరావు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని కొప్పల కొండ, శిరివరంలో చీనీ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెట్ట పరిస్థితుల వల్ల తోటల్లో వేరుకుళ్లు, బంక తెగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ‘బెట్ట’ పెరిగే కొద్దీ వ్యాధి ఉధ్రుతి ఎక్కువవుతుందన్నారు. వ్యాధి నివారణకు ట్రైకోడెర్మా, సుడోమనాస్ వంటి శిలీంధ్ర నాశకాలు, పశువుల ఎరువుతో కలిపి చెట్లకు అందించాలన్నారు. సూక్ష్మ పోషకధాతు లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. కార్బెండిజం మందు ఒక గ్రామును లీటర్ నీటికి కలిపి పాది మొత్తం తడిసేలా పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో రాప్తాడు ఉద్యానశాఖ అధికారి రత్నకుమార్, ఉద్యాన విస్తరణ అధికారి రామాంజనేయులు, శ్రీనివాసులు, గ్రామ ఉద్యానశాఖ అధికారులు గంపరాజు, మల్లికార్జున రైతులు పాల్గొన్నారు.
ఏపీఆర్‌ఎస్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లిలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర పాఠశాలలో (ఏపీఆర్‌ఎస్‌ఓఈ) ప్రవేశానికి 2025–26 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యా సంస్థల జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎన్వీ మురళీధర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు గురువారం స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి 80 సీట్లు ఉన్నాయన్నారు. రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న బాలురు అర్హులన్నారు. ఏపీఆర్‌ఎస్ క్యాట్ (ఏపీఆర్‌ఎస్ సీఏటీ) అర్హత పరీక్ష ద్వారా ప్రవేశం పొందవచ్చన్నారు. అర్హులైన విద్యార్థులు https://aprs. apcfss.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 31 వరకూ గడువు విధించామన్నారు.అదేవిధంగా ఏప్రిల్ 25న జరిగే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారి మార్కుల ఆధారంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు 87126 25065 సెల్ నంబరును సంప్రదించాలన్నారు.
తిరుపతి రైలు తిరిగేలా లేదప్పా!
రాయదుర్గంటౌన్: ఇప్పట్లో రాయదుర్గం ప్రాంత ప్రజలకు కదిరిదేవరపల్లి–తిరుపతి రైలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దాదాపు ఏడాది నుంచి ఈ ప్యాసింజర్‌ను రైల్వే అధికారులు పాక్షికంగా రద్దు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి కదిరిదేవరపల్లి–తిరుపతి మధ్య రాకపోకలు సాగించే రైలు (57405/57406) రద్దును ఈ నెలాఖరు వరకూ పొడిగించారు. ఈ మేరకు సౌత్ వెస్ట్రన్ రైల్వే పీఆర్‌ఓ మంజునాథ కనమడి ఒక ప్రకటనలో తెలిపారు. రాయదుర్గం–తుమకూరు మార్గంలో ట్రాక్ పనులు పూర్తయిన కదిరిదేవరపల్లి వరకు నడుపుతున్న ఏకైక రైలును సైతం రద్దు చేస్తూ వస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అబ్బేదొడ్డిలో చిరుత కలకలం
Comments
Please login to add a commentAdd a comment