లేగదూడ దవడకు శస్త్రచికిత్స
అనంతపురం అగ్రికల్చర్: మూగజీవాలకు పశు సంవర్ధకశాఖ ఏడీలు, డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ రైతుల మన్ననలు పొందుతున్నారు. తాజాగా విరిగిపోయిన లేగదూడ దవడకు శస్త్రచికిత్స చేశారు. వివరాలు.. గార్లదిన్నె మండలం తలకాసులపల్లి గ్రామం వడ్డే నరేష్‌కు చెందిన పాడి ఆవు మూడు రోజుల కింద కోడేదూడను ఈనింది. దూడ ఆరోగ్యంగా ఉన్నా కింది దవడ ఎముక విరిగిపోవడంతో వేలాడసాగింది. దవడ నొప్పి వల్ల పాలు తాగలేక రోజురోజుకూ నీరసిస్తున్న దూడను గమనించి స్థానిక పశువైద్యాధికారి శింగనమల పశువైద్యశాల ఏడీ డాక్టర్ జి.పద్మనాభానికి రెఫర్ చేశారు. దీంతో ఆటోలో అనంతపురంలోని సాయినగర్‌లో ఉన్న పశువైద్యశాలకు దూడను తీసుకువచ్చి తన బృందంతో డాక్టర్ పద్మనాభం శస్త్రచికిత్స చేశారు. దవడ ఎముకకు రెండు వైపులా 2.5 మి.మీ స్టెయిన్‌లెస్ స్టీల్ పిన్నులను అమర్చారు. శస్త్రచికిత్స తర్వాత దూడ దవడ సాధారణ స్థితికి చేరుకోవడం, పాలు తాగడం మొదలు పెట్టింది. దూడకు అవసరమైన ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, అనాల్జిసిక్స్ లాంటి మందులు కూడా అందించినట్లు పద్మనాభం వెలిపారు. శస్త్రచికిత్సలో 1962 అంబులెన్స్ డాక్టర్ సునీత, ట్రైనీ డాక్టర్ నేహ, కమలాకార్, గీత పాల్గొన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment