ఫీజు పోరు జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఫీజు పోరు జయప్రదం చేయండి

Published Sat, Mar 8 2025 2:06 AM | Last Updated on Sat, Mar 8 2025 2:03 AM

ఫీజు పోరు జయప్రదం చేయండి

ఫీజు పోరు జయప్రదం చేయండి

అనంతపురం కార్పొరేషన్‌: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కూటమి సర్కారుకు బుద్ధి చెప్పేందుకు ఈ నెల 12న నిర్వహించే ‘ఫీజు పోరు’ను జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పార్ట శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి నిధులు విడుదల చేయాలని, వైద్య కళాశాలల సంఖ్యను కుదించరాదని 12న ఉదయం పది గంటలకు జెడ్పీ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్‌, సంగమేష్‌ సర్కిల్‌ మీదుగా కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేస్తామన్నారు. అధికారంలోకి వస్తే విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ ఇప్పుడు మాట తప్పారన్నారు. విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.3,900 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉంటే రూ.700 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయన్నారు. ఒత్తిడి తట్టుకోలేకపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. 2014–19 టీడీపీ హయాంలో పెండింగ్‌లో ఉన్న రూ.1,900 కోట్ల బకాయిలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2019 నుంచి 24 వరకు ఐదేళ్ల పాలనలో ఉన్నత విద్యకే రూ.26 వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి సర్కారు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చినా.. బడ్జెట్‌లో కేటాయింపులే లేవన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేయిస్తే.. కొత్తవి అవసరం లేదని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాక పీపీపీ విధానంలో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, అలా చేస్తే వైద్యవిద్య పూర్తిగా ప్రైవేట్‌పరం అవుతుందని అన్నారు.

వెడల్పు చేశాక లైనింగ్‌ చేపట్టండి

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తదితరులకు రాయలసీమపై చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే మొదట హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసి.. ఆ తర్వాత లైనింగ్‌ పనులు చేపట్టాలని అనంత డిమాండ్‌ చేశారు. రాయలసీమ కరువును చూపి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని.. ఇక్కడి ప్రజలకు న్యాయం చేయకపోతే ఎలాగ అని ప్రశ్నించారు. వెడల్పు చేయకుండా లైనింగ్‌ పనులు చేపడితే భవిష్యత్తులో అధికంగా నీరు తెచ్చే పరిస్థితి ఉండదన్నారు. 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ–నీవా కాలువ తవ్వారని, అయితే 12 పంపులున్నా 2,200 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని అన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో 6,300 క్యూసెక్కుల సామర్థ్యాన్ని పెంచుతూ జీఓను విడుదల చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం 3,850కే క్యూసెక్కులకు సరిపెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టు మరో రెండేళ్లలో పూర్తవుతుందని, గోదావరి జలాలను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా బనకచర్లకు నీటిని తీసుకువచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు చెబుతుండడం సంతోషకర విషయమైనా.. బనకచర్ల ద్వారా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం కర్నూలు, కడపకు మాత్రమే నీరు తీసుకెళ్లేందుకు వీలుంటుందన్నారు. 10 వేల క్యూసెక్కులకు హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయడానికి మంత్రి కేశవ్‌, టీడీపీ ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అలా కాకుండా 3,850 క్యూసెక్కులకే పరిమితం చేస్తే రాయలసీమ ప్రజలకు ద్రోహం చేసిన వారిగా కూటమి పాలకులు చరిత్రలో నిలిచిపోతారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రమేష్‌గౌడ్‌, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, చింతకుంట మధు, సైఫుల్లాబేగ్‌, రాధాకృష్ణ, దత్తా, చంద్రశేఖర్‌ యాదవ్‌, కార్పొరేటర్లు కమల్‌భూషణ్‌, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం

ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులపై తీవ్ర ఒత్తిళ్లు

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement