చిప్‌లు అమర్చి.. అక్రమార్జన
అనంతపురం: కొన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ఫిల్లింగ్ యంత్రాల్లో చిప్‌లు అమర్చి.. రీడింగ్ మీటరుపై చూపిన దానికంటే ఆరు నుంచి పది శాతం తక్కువ ఇంధనం నింపుతున్నారు. అనుమానం వచ్చి పరీక్షించినా ఎక్కడా దొరకకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఇది వరకు జిల్లాలో రెండు పెట్రోల్ బంకుల్లో చిప్ అమర్చి తక్కువ ఇంధనం పడుతున్నారని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తేలింది. తాజాగా అనంతపురంలోని నడిమి వంక నుంచి బళ్లారి బైపాస్‌కు వెళ్లే రోడ్డులోని విజయ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. అదే పెట్రోల్ బంకులోనే రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ వైబీపీటీఏ ప్రసాద్ శనివారం విలేకరులతో మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లీటర్‌కు 60 నుంచి 100 ఎంఎల్ ఇంధనం తక్కువగా వాహనాలకు పడుతున్నారన్నారు. ఎవరైనా వాహనాలకు కాకుండా బాటిళ్లలో పెట్రోల్ పట్టాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఆఫ్ చేసే వీలుగా ఆపరేట్ చేస్తున్నారు. జిల్లాలో మరిన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ సీఐలు శ్రీనివాసులు, సద్గురుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment