అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గుత్తి రూరల్: శ్రీపురం గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారి పక్కన శనివారం బి.రవి(38) అనే భవన నిర్మాణ కార్మికుడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీపురం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి ప్యాంటు జేబులో ఉన్న ఓటరు కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతుడు గుంతకల్లు ఉమామహేశ్వరనగర్‌కు చెందిన రవిగా గుర్తించారు. కుటుంబసభ్యులను ఆరా తీయగా శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపారు. బేల్దారు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడని, గుత్తి బండగేరికి చెందిన మణి అనే యువతిని వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఐదు నెలల క్రితం భార్య తమకు చెప్పకుండా భర్త, పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిపోయినట్లు తెలిపారు. మృతుడికి కుమార్తె గౌతమి, కుమారుడు గోవర్ధన్ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రవిది హత్యా లేక రోడ్డు ప్రమాదమా?
శ్రీపురం గ్రామ శివారులో రవి మృతి హత్యనా లేక రోడ్డు ప్రమాదమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఘటన స్థలంలోని ఆనవాళ్లు అనుమానాలకు తావిస్తున్నాయి. మృతదేహం పక్కన పెనుగులాట జరిగినట్లు పాదముద్రలు ఉన్నాయి. రవిని ఇద్దరు లేదా ముగ్గురు హత్య చేసి రోడ్డుపై నుంచి లాక్కొచ్చినట్లు జాడలు ఉన్నాయి. తల, భుజం, ఛాతీపై రక్త గాయాలున్నాయి. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో భవన నిర్మాణ పనులకు ఉపయోగించే తాపీ పడి ఉంది. కుటుంబసభ్యులు సైతం రవి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం రవి బైక్‌పై గుత్తి వైపునకు వేగంగా వస్తూ బైక్ నుంచి రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఐ వెంకటేశ్వర్లును సంప్రదించగా రవి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment