రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు
కూడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని ఏమాత్రం విస్మరించాయని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, రైతు సంఘం రాష్ట్ర నేత రాంభూపాల్ ధ్వజమెత్తారు. రైతు సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం ముద్దలాపురం చేరుకుంది. పాదయాత్రకు డాక్టర్ గేయానంద్, రాంభూపాల్ సంఘీభావం తెలిపారు. ముద్దలాపురంలో బ్యాడిగి మిర్చి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తెగుళ్లతో పంట దిగుబడి బాగా తగ్గిపోయిందని, మార్కెట్లో గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్ట పోయామని రైతులు వాపోయారు. అనంతరం డాక్టర్ గేయానంద్, రాంభూపాల్ మాట్లాడారు. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిరప రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజారాంరెడ్డి, సహాయ కార్యదర్శి నాగేంద్ర కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి క్రిష్టమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment