తిప్పుకుని.. తప్పుకుంటున్నారు!
● ‘నీటి కుళాయి కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కుళాయి కనెక్షన్ ఇప్పించేలా చూడండి’ అంటూ తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన సూర్యప్రకాష్ జనవరి 27న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశాడు.
● తాము నివాసముంటున్న 9వ వార్డులో మురికి కాలువ నిర్మాణం కోసం గ్రామసభలో తీర్మానం చేసినా పనులు చేపట్టలేదని, తగిన చర్యలు తీసుకోవాలని గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన మహమ్మద్ రఫీ ఈనెల 3వ తేదీన ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు.
● ‘ఇంటి స్థలం సర్వే నంబరు 506–4లో ప్లాట్ నంబరు 86 హద్దులు పోయాయి. అధికారులకు చెప్పి హద్దులు చూపించండి’ అంటూ కూడేరు మండలం సంగమేశ్వర కాలనీకి చెందిన బషీర్ అహమ్మద్ ఈనెల 3న పరిష్కార వేదికలో అధికారులను కోరాడు.
.... ఇవన్నీ గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలే. కానీ, అక్కడి అధికారులు పట్టించుకోకపోవడంతో చేసేది లేక ప్రజలు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఒకటి రెండు కాదు ప్రతి వారం పదుల సంఖ్యలో ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి.
సమస్యల పరిష్కారంపై
ప్రత్యేక దృష్టి
ఏస్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ఆస్థాయిలోనే పరిష్కారం కావాలి. ఇక నుంచి ప్రత్యేకంగా తహసీల్దారు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్ని తనిఖీ చేస్తాం. వాటి స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలను పరిశీలించి ఎన్ని పరిష్కరించారు.. ఎన్ని పెండింగ్ ఉన్నాయి..ఎందుకు పెండింగ్ పెట్టారు.. అనేదానిౖపై విచారణ చేస్తాం. అర్జీదారులతో కూడా ఫోన్ ద్వారా మాట్లాడి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం.
– వి.వినోద్‌కుమార్, కలెక్టర్
అనంతపురం అర్బన్: గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి ప్రజా సమస్యలకు సంతృప్తికర పరిష్కారం చూపించాల్సి ఉన్నా ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎక్కడా కానరావడం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలనే ఆలోచన ఇక్కడి అధికారులు, సిబ్బందిలో కరువవుతోంది. దీంతో అర్జీదారులు జిల్లా కేంద్రంలో నిర్వహించే ‘పరిష్కార వేదిక’ను ఆశ్రయిస్తున్నారు. అర్జీల్లో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించినవే ఉంటున్నాయి. అటు తరువాత సర్వే, భూరికార్డుల శాఖ, పోలీసు శాఖకు సంబంధించి ఉంటున్నాయి.
నిర్లక్ష్య ధోరణి... అవినీతి!
మండలస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్రధానంగా కొందరు అధికారులు, సిబ్బందిలో నిర్లక్ష్యధోరణి, అవినీతి కారణమనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సమస్యలు పరిష్కరించండంటూ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కొందరు.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ మరికొందరు అర్జీ రూపంలో తమ సమస్యతో పాటు ఫిర్యాదును పరిష్కార వేదికలో కలెక్టర్, అధికారులకు దృష్టికి తీసుకొస్తుండటమే ఇందుకు నిదర్శనం.
మండల స్థాయిలో పరిష్కారం కాని ప్రజాసమస్యలు
వ్యయ ప్రయాసలకోర్చి
కలెక్టరేట్‌కు వస్తున్న బాధితులు
కిందిస్థాయి అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
తిప్పుకుని.. తప్పుకుంటున్నారు!
Comments
Please login to add a commentAdd a comment